ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా.. ఇప్పుడు రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కథానాయికల్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. కథ రీత్యా ఇందులో ముగ్గురు నాయికలకు అవకాశముందని తెలిసింది.
వీటిలో రెండు పాత్రల కోసం నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మరో నాయికను త్వరలో ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. హారర్ అంశాలతో నిండిన విభిన్నమైన కథతో ఈ చిత్రం రూపొందనుందని టాక్. ఓ చిన్న షెడ్యూల్‌తో వచ్చే వారంలో రెగ్యులర్ చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ లేని కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' విడుదలకు సిద్ధమవుతుండగా.. 'సలార్', 'ప్రాజెక్ట్ కె' (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణ దశలో ఉన్నాయి.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఫ్రభాస్ కలయికలో వస్తున్న మరో చిత్రం 'సలార్ '. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి ఆదివారం ఓ అప్డేట్ రానుందని సమాచారం. కానీ దీనిపై అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. అయితే ఫ్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న కచ్చితంగా 'సలార్' చిత్రం నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని సినీ వర్గాల సమాచారం.
ఇవీ చదవండి : లుంగీ కట్టి మాస్బీట్కు స్టెప్పులేసిన కీర్తి సురేశ్.. ఇక కుర్రాళ్ల హార్ట్ హైజాకే..