Mahadev Betting App Case : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో మరో నటి శ్రద్ధకపూర్‌కు సమన్లు పంపిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్- ఈడీ.. శుక్రవారమే విచారణకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
నటుడు రణ్‌బీర్ కపూర్ కూడా..
Mahadev Betting App Bollywood : ఇప్పటికే ఈ కేసులో స్టార్ నటుడు రణ్‌బీర్ కపూర్, హాస్యనటుడు కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, హీనాఖాన్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. రణ్‌బీర్ కపూర్ కూడా శుక్రవారమే రాయ్‌పుర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన రెండు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌ను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు.
రోజుకు రూ.200 కోట్లు!
Mahadev Betting App News : అయితే మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ భారత్‌లో నాలుగు వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లు ఉన్నారు. ఆ లెక్కన రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతోంది. 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. ఈ యాప్ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సౌరభ్, రవి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
15 మంది సెలబ్రిటీలు..
Mahadev Betting App Scam అయితే నటులు ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి.. అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బు అందుకున్నారన్నది ఈడీ అభియోగం. ఈ కేసులో 14 నుంచి 15 మంది ప్రముఖ సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మిగతా వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో వీరు నిందితులు కారని, హవాలా వ్యవహారంలో చెల్లింపులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడానికే వీరిని విచారించనున్నట్లు సమాచారం.