Dipika Chikhlia Om Raut Kriti Sanon Issue : బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడి పాత్రలో స్టార్ హీరో ప్రభాస్ నటిస్తుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. కార్యక్రమం తర్వాత మూవీ టీమ్ శ్రీవారిని దర్శించుకుంది. దర్శనం అనంతరం ఆలయం వెలుపల దర్శకుడు ఓం రౌత్ బయలుదేరడానికి ముందు హీరోయిన్ కృతి సనన్‌ను ఆలింగనం చేసుకొని ఆమె చెంపపై ముద్దు పెట్టారు. దీంతో ఈ సినిమా దర్శకుడుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి.
పవిత్రమైన శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఓం రౌత్ అలా చేయడం క్షమించరాని నేరం అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విపరీతంగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో హిందీ టీవీ ఛానల్లో రామాయణం సీరియల్లో సీతగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపికా చిఖ్లియా స్పందించారు.
తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో దర్శకుడు ఓం రౌత్.. కృతి సనన్‌ను కిస్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది దీపిక. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాలంలో నటీనటులలో తాము చేసే పాత్రలపై పూర్తి అవగాహన ఉండటం లేదని అన్నారు. ఇదే ఇప్పటితరం తారలలో వచ్చిన సమస్య అని పేర్కొన్నారు. వాళ్లు తమ పాత్రల్లోకి పూర్తిగా ప్రవేశించలేరని, కనీసం ఆ పాత్రను అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. వాళ్లకు రామాయణం అనేది కేవలం ఓ సినిమాలానే కనిపిస్తోందని, దానితో వారు ఆధ్యాత్మికంగా కనెక్ట్ కాలేకపోతున్నారని తెలిపారు.
'సెట్లో పేరు పెట్టి పిలిచేవారు కాదు.. కాళ్లకు దండం పెట్టేవారు'
తాను కూడా సీత పాత్రలో నటించానని చెప్పింది దీపికా. నేటి తరం ఇలాంటి కథల్ని ఒక ప్రాజెక్టుగానే చూస్తారని, సినిమా అయిపోయిన తర్వత మర్చిపోతారని వ్యాఖ్యానించారు. కానీ తమ కాలంలో అలా ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు. తాను సీరియల్లో సీతగా చేసిన సమయంలో సెట్లో కనీసం తమను పేరు పెట్టి పిలవడానికి కూడా ఆలోచించేవారని పేర్కొన్నారు. సీత పాత్రలో ఉన్నపుడు అందరూ గౌరవంగా చూసేవారని, కొంతమంది అయితే పాదాలకు నమస్కారం చేసేవారని.. ఆనాటి పరిస్థితుల్ని తలుచుకుంది దీపికా.
'ఆ రోజులు వేరు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..'
సెట్లో ఎప్పుడూ తమను నటులుగా చూసే వారు కాదని, దేవుళ్లుగా చూసేవాళ్లని తెలిపారు. తాము ఎవర్ని ఇలా ఆలింగనం చేసుకోవడం, ముద్దులు పెట్టుకోలేదని తెలిపారు. ప్రేక్షకులు లేదా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తాము ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా తర్వాత నటీనటులు ఈ సినిమా గురించి మర్చిపోతారని, వేరే ప్రాజెక్టులు చూసుకుంటారని.. కానీ తమ కాలంలో అలా ఉండేది కాదని పేర్కొన్నారు. ఆ రోజులే చాలా వేరని.. ఇప్పుడా పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.