KGF Heroine Srinidhi: అందంగా కనిపించడానికి మేకప్ అవసరమే... కానీ అసలైన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం అంతకన్నా అవసరం అంటోంది 'కేజీఎఫ్' భామ శ్రీనిధిశెట్టి. గతంలో మిస్ సూపర్నేషనల్ టైటిల్‌ని గెల్చుకున్న ఈ అమ్మడు తాను పాటించే చిట్కాల్ని చెప్పుకొచ్చిందిలా...
మోడల్‌గా పేరుతెచ్చుకోవాలన్నది నా కల. బెంగళూరులో ఓ ఫ్యాషన్‌వీక్‌లో పాల్గొనడానికి వెళ్తే బరువు ఎక్కువగా ఉన్నానని వద్దన్నారు. ఇక నా కలకి గుడ్‌బై చెప్పేద్దామనుకున్నా. రాత్రంతా ఏడ్చాక 'ఆ తిరస్కారాన్ని ఛాలెంజ్‌గా' తీసుకోవాలనిపించింది.
జిమ్‌కెళ్లి వర్క్‌వుట్లు మొదలుపెట్టా. రోజూ 65 కేజీల బరువు ఎత్తేదాన్ని. ఆ తర్వాత ఐటీ కంపెనీలో ఉద్యోగం. జిమ్, ఆఫీస్ అయ్యాక... అడుగు కూడా వేయలేనంత నీరసం ఆవహించేది. అయినా నాకు నేను ఉత్సాహం తెచ్చుకుంటూ.. మాటిమాటికీ నా కలను గుర్తుచేసుకుంటూ మిస్ సూపర్నేషనల్ టైటిల్‌ని గెల్చుకున్నా!
ఆ సమయంలో విపరీతమైన మేకప్ వేసేవారు. అప్పుడే చర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి తెలిసింది. వృత్తిరీత్యా మేకప్ వేసుకున్నా చర్మం సహజ సౌందర్యాన్ని కాపాడుకోవాలిగా. ఇందుకోసం ఖరీదైన మాయిశ్చరైజర్లూ, ప్రైమర్‌పై ఎక్కువ ఖర్చు చేసేదాన్ని. వీటి వల్ల మేకప్ ప్రభావం చర్మంపై తక్కువ పడేది.
రోజ్, అలొవెరాలతో చేసే మిస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. మేకప్‌కి ముందూ, తర్వాత ఇది చేసే మాయాజాలం అద్భుతం. ఇక ఎండ వేడి నుంచి కాపాడుకోవడానికి విటమిన్ సి సీరమ్‌నీ, సన్‌స్క్రీన్‌నీ రోజువారీ చర్మ రక్షణలో భాగం చేసుకున్నా. నిద్రపోయే ముందు కచ్చితంగా టోనర్‌తో మేకప్‌ని తొలగిస్తా. మంచినీళ్లు, మంచి నిద్ర ఈ రెండింటి విషయంలో రాజీపడను.
ఇదీ చూడండి: వసూళ్ల వేటలో దూసుకెళ్తున్న 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2'