Mohan Juneja death: ప్రముఖ కన్నడ నటుడు, కమెడియన్ మోహన్ జునేజా(54) కన్నుమూశారు. కేజీఎఫ్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ యాక్టర్.. దీర్ఘకాల కాలేయ వ్యాధితో పోరాడుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ట్రీట్మెంట్కు ఆయన స్పందించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయన వైద్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశాయి.
Mohan Juneja in KGF movie: జునేజా అంత్యక్రియలు శనివారం సాయంత్రం బెంగళూరులోని తమ్మెనహళ్లిలో నిర్వహించనున్నారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జునేజా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Mohan Juneja movies: మోహన్ జునేజా స్వస్థలం తుమకూరు. ప్రధానంగా కన్నడ చిత్రాలు చేసినా... తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించారు. మొత్తం 150కి పైగా చిత్రాల్లో నటించారు. కేజీఎఫ్ ఛాప్టర్ 1, 2, లక్ష్మీ, బృందావన, కోకో, స్నేహితరు వంటి కన్నడ సినిమాల్లో ఆయన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు లభించింది. పలు కన్నడ సీరియళ్లలోనూ మోహన్ జునేజా నటించారు. కర్ణాటకలో మంచి క్రేజ్ తెచ్చుకున్న వటారా సీరియల్లో కీలక పాత్ర పోషించారు. జునేజాకు భార్య కుసుమ, అక్షయ, అశ్వినీ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.
ఇదీ చదవండి: అడివి శేష్ 'మేజర్' ట్రైలర్.. 'సీతా రామం' అప్డేట్