KKG Actor Krishna Ji Rao Passed Away : 'కేజీయఫ్' తాతగా ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు కృష్ణాజీ రావు ఇకలేరు. అనారోగ్యంతో కొన్నిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం మరణించారు. వయసు రీత్యా వచ్చే సమస్యల కారణంగా ఆయన హాస్పిటల్‌లో చేరారని, చికిత్స పొందుతూనే కన్నుమూశారని శాండిల్‌వుడ్ వర్గాలు పేర్కొన్నాయి. కృష్ణాజీ మృతి పట్ల కన్నడ చలన చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లోని ఓ గ్రామంలో పుట్టి, పెరిగిన కృష్ణాజీ సినిమారంగంలో అడుగుపెట్టాలని బెంగళూరుకు వెళ్లారు. కానీ, ఎక్కడా అవకాశం లభించలేదు. దీంతో కొన్ని నెలలు జూనియర్ ఆర్టిస్ట్‌గా చేశారు. తర్వాత, పలువురు ప్రముఖుల దర్శకుల వద్ద అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా సుమారు 40 సినిమాలకు పనిచేశారు.
దాదాపు 500 చిత్రాలకు సెన్సార్ స్క్రిప్టు రాశారు. ఓ మేనేజరు చెప్పగా 'కేజీయఫ్' సినిమా ఆడిషన్‌కు వెళ్లారు. తన ప్రతిభని నిరూపించుకొని ఆ సినిమాలోని అంధుడి పాత్రకు ఎంపికయ్యారు. యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయనది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినా మంచి ప్రభావం చూపింది. అందులో హీరో పవర్ గురించి ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించాయి. దీంతో కృష్ణాజీకి నటుడిగా వరుస అవకాశాలు వచ్చాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నానో నారాయణప్ప' విడుదలకు సిద్ధమవుతోంది.