కొంతకాలంగా భారతీయ చిత్ర పరిశ్రమలో భాషల అంతరాలు తొలిగిపోయాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు ఒకేసారి రెండు, మూడు భాషల్లో తెరకెక్కుతున్నాయి. అదే క్రమంలో కన్నడ నుంచి వచ్చిన 'కేజీయఫ్' ఇండియన్ బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లను అందుకుని.. ఆ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచింది.
ఒకప్పుడు ఆ సినీ పరిశ్రమలో ఇతర భాషల సినిమాలను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ కేజియఫ్ దెబ్బతో అక్కడ ట్రెండ్ మారింది. మిగతా భాషల వాళ్ళు అక్కడి ఒరిజినల్ చిత్రాలపై ఆసక్తి చూపించడం ప్రారంభించారు. దీంతో అక్కడి మేకర్స్ కూడా తమ చిత్రాలను అన్నీ భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది వ్యవధిలో కేజీయఫ్ 2 మినహా విడుదలైన మూడు చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. అన్నీ భాషల వారిని బాగా ఆకట్టుకున్నాయి. మరో విశేషమేమిటంటే ఆ మూడు చిత్రాలు శెట్టిలదే. మూడూ మిడియం బడ్జెట్ చిత్రాలే. ఇంతకీ ఆ ముగ్గురే ఎవరంటే.. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బీ శెట్టి.
రాజ్ బీ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన గరుడ గమన వృషభ వాహన సినిమా గతేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. స్వయంగా కథ రాసుకుని రాజ్ బీ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో రిషభ్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటించారు.
అలాగే రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 777 చార్లీ సినిమా కూడా ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాక ఈ సినిమాకు స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు రక్షిత్ శెట్టి. ఇందులో రాజ్ బీ శెట్టి కూడా ఓ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
ఇక ఈ సినిమా కాకుండా తాజాగా విడుదలైన కాంతార సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. కానీ ఇది ఇంకా తెలుగులో విడుదల కాలేదు. త్వరలోనే రానుంది.
అలా గత ఏడాది వ్యవధిలో ముగ్గురు శెట్టిలు కన్నడ సినీ పరిశ్రమకు మూడు సూపర్ హిట్లు ఇచ్చారు. మిగతా భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు సినీ అభిమానులు, సెలబ్రిటీలు ఈ ముగ్గురికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఇదీ చూడండి: Mokshagna: మహేశ్ మల్టీప్లెక్స్‌లో యంగ్ లయన్.. వీడియో చూశారా?