Kamal Haasan Vikram Movie: కొన్ని సినిమాలు ప్రకటించినప్పుడే ఆసక్తిగా అనిపిస్తాయి. అలాంటి సినిమానే కమల్‌హాసన్ 'విక్రమ్'. విలక్షణ నటులుగా పేరుతెచ్చుకున్న విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటమే అందుకు కారణం. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముగ్గురు స్టార్ నటులు నటిస్తుండటం వల్ల ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక శనివారం నుంచి టికెట్ బుక్సింగ్ ప్రారంభం కాగా, అక్కడ కూడా భారీ స్పందన వస్తున్నట్లు సమాచారం. అడవి శేష్ 'మేజర్', అక్షయ్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' వంటి చిత్రాలు విడుదలవుతున్నా, 'విక్రమ్'కు బుక్సింగ్స్ కూడా ఏమాత్రం తగ్గడం లేదట.
ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్ర ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్. దాదాపు రూ.200 కోట్లకు డీల్ ముగిసిందట. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రూ.110 కోట్లు. అంటే కేవలం ఓటీటీ+శాటిలైట్ రైట్స్ ద్వారా అదనంగా రూ.90కోట్లు వచ్చేశాయన్నమాట. మేకర్స్‌కు ఇది నిజంగా అదనపు బోనస్. డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్‌లు నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ విడుదల చేస్తోంది.
సన్నీ 'అన్‌స్టాపబుల్': 'బిగ్‌బాస్' సీజన్ 5 విజేత వీజే సన్నీ హీరోగా దర్శకుడు డైమండ్ రత్నబాబు ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకరచయిత విజయేంద్రప్రసాద్, దర్శకుడు బి. గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి విజయేంద్ర ప్రసాద్ క్లాప్ కొట్టగా గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'అన్‌స్టాపబుల్' అనే టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. రంజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మరోవైపు, సన్నీ 'ఏటీఎమ్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. 'బుర్రకథ', 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాలను తెరకెక్కించిన దర్శకుడే డైమండ్ రత్నబాబు.
ఇక ఉచితంగానే 'కేజీయఫ్2': యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'కేజీయఫ్: చాప్టర్2'. కేజీయఫ్ మొదటి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే, ఓటీటీలో కూడా ఈ సినిమా చూసి ఆస్వాదిద్దామనుకున్న ప్రేక్షకులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచి అమెజాన్ ప్రైమ్ వీడియో షాకిచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎలాంటి అదనపు అద్దె చెల్లించకుండా ఈ సినిమాను చూడవచ్చని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. జూన్ 3వ తేదీ నుంచి ప్రైమ్ వినియోగదారులు ఉచితంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లైనా ఈ సినిమాను చూడొచ్చు. ఆఫ్‌లైన్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన రూ.199 చెల్లించి 'కేజీయఫ్: చాప్టర్2' తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో చూడొచ్చు.
ఓటీటీలో శివ కార్తికేయన్ 'డాన్': తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు శివకార్తికేయన్. ఇటీవల ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. అలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'డాన్'. శిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. శివ కార్తికేయన్, ఎస్‌జే సూర్యల నటన అందరినీ కట్టిపడేసింది. ముఖ్యంగా హాస్య సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్ వేదికగా 'డాన్'ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 10 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి: ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..