ఆమె వెండితెర చందమామ. అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. తల్లి కూడా అయింది. అయినా ఏ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. తనే హీరోయిన్ కాజల్ అగర్వాల్.
2004లో 'క్యూన్ హో గయా నా' అనే హిందీ చిత్రంతో నటిగా పరిచయమైంది. అమితాబ్ బచ్చన్, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిందా సినిమా. అందులో ఐశ్వర్య సోదరిగా కనిపించింది కాజల్. ఆ తర్వాత 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో కథానాయికగా తన ప్రస్థానం మొదలుపెట్టింది. కల్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించారు. ఇందులో లక్ష్మీ అనే పల్లెటూరి అమ్మాయిగా తన సహజమైన నటన, అందంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.
ఇక ఆ తర్వాత చందమామ, పౌరుడు, ఆటాడిస్తా లాంటి చిన్న సినిమాలు చేసింది. అనంతరం మగధీరతో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ఆర్య 2, డార్లింగ్, మిస్టర్ ఫెర్ఫెక్ట్, సింగం(హిందీ), బిజినెస్ మేన్, తుపాకీ, బాద్ షా, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150 తదితర హిట్ సినిమాలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లిచేసుకుంది. తల్లి కూడా అయింది. దీంతో రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. త్వరలోనే కమల్‌హాసన్ ఇండియన్ 2తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.
ఇదీ చూడండి: ఒకే సాంగ్‌లో గెస్ట్లుగా 8 మంది హీరో, హీరోయిన్స్.. ఆ మూవీ ఏంటంటే?