జాయ్ ల్యాండ్ ఇది ఒక పాకిస్థానీ సినిమా. ఆ దేశం నుంచి ఆస్కార్ బరిలో ఉన్న మొదటి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఆ దేశంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. తమ దేశ విలువలు అతీతంగా ఉందనే కారణంగా ఈ సినిమాను నిషేధించారు. అనంతరం సెలెబ్రిటీలు, ప్రజల నుంచి విమర్శలు రావడం వల్ల.. ఆ దేశ ప్రధాని షెహబాజ్.. ఓ కమిటీ ఏర్పాటు చేసి నిషేధాన్ని ఎత్తేశారు. ఇలాంటి ఆటంకాలన్నీ దాటుకుని అకాడమీ అవార్డ్ కోసం ఈ మూవీ పోటీ పడుతోంది. సొంత దేశంలో గడ్డు పరిస్థితులు ఎదురైనా ఈ సినిమాను అంతర్జాతీయ సమాజం ఆదరించింది.
కాగా, ఈ చిత్రానికి తెలుగమ్మాయి అపూర్వ చరణ్ నిర్మాతగా వ్యహరించడం విశేషం. అపూర్వ చరణ్ హైదరాబాద్‌లోనే పుట్టింది. అనంతరం ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. అపూర్వ దాదాపు 20కిపైగా లఘు చిత్రాలను నిర్మించింది. జాయ్ ల్యాండ్ కథ.. అపూర్వకు ఆమె స్నేహితుల ద్వారా తెలిసింది. అనంతరం కథ, కథనాలు నచ్చాయి. దీంతో ఈ సినిమా నిర్మించేందుకు ఒప్పుకుంది. జాయ్ ల్యాండ్ సినిమాను తొలిసారిగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఆ సమయంలో స్టాండింగ్ ఒవేషన్ దక్కించుకుంది. అంతర్జాతీయంగా సత్తా చాటడం వల్ల పాకిస్థానీ ప్రభుత్వం అధికారికంగా ఆస్కార్స్‌కు పంపిచింది. దీంతో ఆస్కార్ నామినేషన్ జరిగే ప్రక్రియలో షార్ట్‌లిస్ట్ అయ్యింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీపడుతోంది. ఈ కేటగిరిలోనే భారత్‌కు చెందిన 'చెల్లో షో' చిత్రం కూడా పోటీపడుతోంది.
ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులకు తెలియకుండా ఒక ట్రాన్స్ జెండర్‌తో ప్రేమలో పడితే ఏం జరింగింది.. ఆ తర్వాత పరిణామాలు గురించి జాయ్ ల్యాండ్ సినిమాలో చూపించారు. ఈ సినిమాకు సైమ్ సాదిక్ దర్శకత్వం వహించారు. అలీ జునేజో, రస్తీ ఫరూక్, అలీనా ఖాన్, సర్వత్ గిలానీ, సల్మాన్ పీర్జాదా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నోబెల్ అవార్డ్ గ్రహీత మలాలా యూసఫ్జాహీ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. సినిమా ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ కావడంపై ఆమె స్పందించారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.