Rajnikanth Jailer Movie Telugu Review : చిత్రం: జైలర్; స్టార్స్ : రజనీకాంత్, జాకీ ష్రాఫ్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మేనన్, తమన్నా, యోగిబాబు తదితరులు; సంగీతం: అనిరుధ్ రవిచందర్; సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తిక్ కణ్ణన్; ఎడిటింగ్: ఆర్.నిర్మల్; నిర్మాత: కళానిధి మారన్; రచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్; రిలీజ్ డేట్: 10-08-2023
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే ఇక తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగువారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక్కడ కూడా ఆయన సినిమాలకు మంచి డిమాండ్. రెండేళ్ల కిందట వచ్చిన 'పెద్దన్న' తర్వాత రజనీ మరో సినిమాలో కనిపించలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. దీంతో కేవలం మూడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్‌కుమార్‌కు రజనీ అవకాశం ఇచ్చారు. తాజాగా వచ్చిన ట్రైలర్లో పాత రజనీని గుర్తు చేశారు. మరి అభిమానుల అంచనాల నడుమ విడుదలైన 'జైలర్'లో రజనీ పాత్ర ఏలా ఉంది ? శత్రువులపై ఆయన ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? నెల్సన్ ఎలా ఈ మూవీని తెరకెక్కించారు? ఆ వివరాలు మీ కోసం..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'జైలర్' స్టోరీ ఏంటంటే: ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్యన్ (రజనీకాంత్) ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయన్ను అందరూ టైగర్ అంటుంటారు. భార్య (రమ్యకృష్ణ), ఏసీపీగా పనిచేస్తున్న తనయుడు అర్జున్, మనవడే లోకంగా జీవితం గడుపుతుంటాడు. అయితే నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడనే పేరున్న అర్జున్ పనితీరుని చూసి తనలాగే తన కొడుకు నీతి నిజాయతీలతో పనిచేస్తున్నాడని గర్వపడుతుంటాడు. ఇంతలోనే విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడైన వర్మ (వినాయకన్) ఏసీపీ అర్జున్‌ని పొట్టనపెట్టుకుంటాడు. అయితే ఆ విషయాన్ని పోలీసులు కూడా బయట పెట్టలేని పరిస్థితి. అంతటితో ఆగకుండా అర్జున్ కుటుంబాన్ని కూడా అంతం చేయడానికి సిద్ధపడతాడు. తన కుటుంబానికే అపాయం ఏర్పడిందని తెలుసుకున్న ముత్తు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో వర్మని ముత్తు ఏం చేశాడనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే: మాఫియా, రివెంజ్, కుటుంబ అంశాలన్ని ఒకటిగా చేసి రూపొందించిన ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. ఇందులో రజనీకాంత్ మాస్ స్టైల్, హీరోయిజమే ప్రధానంగా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రజనీ వన్ మ్యాన్ షో. అయితే ఈ మూవీ గతేడాది విడుదలై సెన్సేషన్స్ క్రియేట్ చేసిన 'విక్రమ్' సినిమా తరహాలోనే ఉంది. ఓ మాఫియా ముఠాని, దానికి నాయకుడైన వర్మ క్రూరత్వాన్ని పరిచయం చేస్తూ ఆరంభమవుతుంది ఈ చిత్రం. పాత్రల్ని పరిచయం చేయడానికి సమయం తీసుకున్న దర్శకుడు.. ఆ తర్వాత అసలు కథని మొదలుపెట్టారు. తాతయ్య ముత్తుగా, ఇంట్లో పనులు చూసుకునే రిటైర్డ్ పోలీస్ అధికారిగా చాలా నేచురల్‌గా రజనీని పరిచయం చేశారు.
Jailer Movie Review In Telugu : ఫ్యామిలీ చుట్టూ జరిగే పలు సన్నివేశాలకు వినోదాన్ని కలిపి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. రజనీకాంత్ - యోగిబాబుల మధ్య కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇదే కీలకం. ఇక అర్జున్ మిస్సింగ్ తర్వాతనే అసలు కథ మొదలవుతుంది. తన తనయుడి ఆచూకీ కోసం ముత్తువేలు రంగంలోకి దిగాక ఆయనకు ఎదురయ్యే పరిణామాలు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తాయి. ఓ వైపు తనయుడి మరణానికి కారణమైన వాళ్లని అంతం చేస్తూనే... మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. తన అస్త్రాల్ని సిద్ధం చేసుకోవడం కోసం రజనీ చేసే ప్రయత్నాలు.. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకి మరింత హైలైట్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Rajni Jailer Review : తన ఇంట్లోనే జరిగే ఫైటింగ్ సీన్స్‌లో రజనీలోని పూర్తి స్థాయి యాక్షన్ కోణాన్ని ఆవిష్కరిచండంతోపాటు, సెకెండ్ హాఫ్‌పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. అనుకున్నట్టుగానే సెకండాఫ్ మొదలైనా ఆ తర్వాతే కథ అనూహ్యంగా పక్కదారి పడుతుంది. విలన్ డిమాండ్‌కి తలొగ్గడం, అతని కోరిక మేరకు కిరీటం తీసుకొచ్చే సన్నివేశాలు నేల విడిచి సాము చేసినట్టుగా అనిపిస్తాయి.
మరోవైపు రజనీ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు కూడా అంతగా మెప్పించవు. పైగా బలహీనంగా కనిపించే రజనీకి ఆ గెటప్ నప్పలేదు. అయితే ప్రీ క్లైమాక్స్‌కి ముందు వచ్చే ట్విస్ట్ తర్వాత మళ్లీ సినిమా గాడిన పడుతుంది. శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్‌ల అతిథి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకెండ్ హాఫ్ అంతంత మాత్రమే అనిపించినా... రజనీ తనదైన నటనతో సినిమాని నిలబెట్టారు. అభిమానులకైతే ఈ సినిమా మరింత కిక్ ఇస్తుంది.
ఎవరెలా చేశారంటే: అంతా తానై నడిపించాడు రజనీకాంత్. తాతయ్యగా తెల్లటి జుట్టు, గెడ్డంతోనే తెరపై కనిపించినా సరే... తన మార్క్ మాస్ అంశాలు ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు. ఆయన స్టైల్, హీరోయిజం కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తండ్రీ కొడుకులు కథ కావడం వల్ల పతాక సన్నివేశాల్లో మంచి భావోద్వేగాల్ని కూడా పండించారు.
Rajni Jailer Cast : ఇక నరసింహగా శివ రాజ్‌కుమార్, మాథ్యూగా మోహన్‌లాల్ తెరపై చేసిన సందడి సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జాకీష్రాఫ్ పాత్ర కూడా చిన్నదే. రమ్యకృష్ణ హౌస్‌వైఫ్‌గా కనిపించారు. ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యం లేదు. వినాయకన్ విలనిజం సినిమాకి హైలెట్‌గా నిలిచింది. సునీల్, తమన్నాల ట్రాక్ అక్కడక్కడా నవ్విస్తుంది. సాంకేతికంగా సినిమా బాగుంది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి జీవం పోసింది. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చక్కటి పనితీరును ప్రదర్శించాయి. తెలిసిన ప్రతీకార కథనే, పలు మలుపులతో రజనీ శైలికి తగ్గట్టుగా మలిచిన నెల్సన్ దర్శకుడిగా మంచి ప్రతిభని ప్రదర్శించారు. రజనీ శైలి మాస్ అంశాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టడం వల్ల కథ, కథనాల పరంగా అక్కడక్కడా లోటుపాట్లు కనిపిస్తాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
- బలాలు
- + రజనీకాంత్
- + ప్రథమార్ధం, సంగీతం
- + హాస్యం... విరామ సన్నివేశాలు
- బలహీనతలు
- - ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు
- - తెలిసిన కథే
- చివరిగా..: 'జైలర్'... మెప్పించాడు రాజా!
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Rajnikanth Jailer Shows : 'జైలర్'.. ఆ విషయంలో 'కేజీయఫ్', 'అవతార్'నే దాటేసిందిగా..