జబర్దస్త్ నరేశ్.. చాలా తక్కువ కాలంలోనే తన కామెడీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తన హావభావాలతో జబర్దస్త్‌లో ఎన్నో స్కిట్లను హిట్ చేయించిన నరేశ్.. నవ్వించడానికి ఒడ్డూ పొడవుతో సంబంధం లేదని నిరూపించాడు. తనుకున్న హైట్ సమస్యనే ప్లస్ చేసుకుని జబర్దస్త్‌గా దూసుకెళ్తున్నాడు. కామెడీ టైమింగ్, పంచ్‌లతో బుల్లితెర ప్రేక్షకులకు కితకితలు పెడుతున్నాడు. స్టార్‌గా ఎదిగిన ఈ కమెడియన్.. తన లైఫ్, కెరీర్ గురించి ఏమంటున్నాడంటే..
"కెరీర్ మొదట్లో ఎలా ఉన్నాను.. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాను అనేది గుర్తుంచుకుంటాను. నేను ఇంకా పైస్థాయికి ఎదగాలి.. అలాగే మన షోని మనం కాపాడుకోవాలని అనుకుంటుంటాను. జబర్దస్త్‌లో ప్రయాణం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఓ కారు, ఇల్లు కొనుక్కోవాలని కోరిక. ఇప్పటికే కారు కొనేశాను, ల్యాండ్ కొన్నాను.. త్వరలోనే ఇల్లు కూడా కట్టుకుంటాను. 90 శాతం ఈ ఏడాదే అయిపోతుంది. లేదంటే వచ్చే ఏడాదిలో గృహప్రవేశం చేస్తాను."
- నరేశ్
అది విచిత్రమే: తనకు పెళ్లంటూ జరిగితే అది పెద్ద విచిత్రమే అవుతుందని అంటున్నాడు నరేశ్. ఒకవేళ జరిగితే మొత్తం జబర్దస్త్ ఫ్యామిలీ అంతా తన ఇంట్లో ఉంటుందని.. ఇంకో డబుల్ త్రిబుల్ జబర్దస్త్ ఏమైనా వస్తోందా అనేంత హడావుడి ఉంటుందన్నాడు. అయితే ముందు ఇల్లు కట్టుకోవడం పూర్తయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పాడు. ఈ విషయంపై ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదని.. అంతా తన ఇష్టమే అని అన్నాడు.
కల నెరవేరింది: మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన జీవితంలో సాధించిన అతిపెద్ద విజయం అని అంటున్నాడు నరేశ్. "చిరంజీవిగారితో చేయడం నా డ్రీమ్. ఆయన్ను ఒక్కసారైనా కలవాలని అందరికీ ఉంటుంది. అలాంటిది ఆయన తన భోళాశంకర్ సినిమాలో నరేశ్‌ని పెట్టుకోండి అని చిత్రబృందానికి చెప్పి అవకాశం ఇప్పించడం నా జీవితంలో పెద్ద అచీవ్మెంట్. షూటింగ్ సమయంలో నాతో సరదాగా మాట్లాడారు. చాలా సంతోషం అనిపించింది. రెండు రోజులు ఆయనతో షూటింగ్లో పాల్గొన్నాను. ఆయనను కలవడమే డ్రీమ్ అంటే.. నేను స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నాను." అని సంతోషం వ్యక్తం చేశాడు. దాదాపు పదేళ్ల నుంచి ప్రజలు తనను ఆదరిస్తున్నారని.. తనను, జబర్దస్త్‌ను భవిష్యత్తులో మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాడు నరేశ్.
ఇదీ చూడండి : అసలు పెళ్లే వద్దనుకున్నాడు.. ఇప్పుడు ఆమెతో పీకల్లోతు ప్రేమలో.. ఆ ఒక్క ఇంటర్వ్యూతో..