Jabardast Tagubotu ramesh: 'అబ్బా తమ్ముడు '... సినీ, బుల్లితెర ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకస్థానం సంపాదించిన డైలాగ్ ఇది. తన నటన, కామెడీ టైమింగ్‌తో 'తాగుబోతు'గా రమేశ్ వేసిన ముద్ర అలాంటింది మరి. మందుబాబు పాత్రల్లో మెప్పిస్తూ తాగబోతు రమేశ్గా పాపులర్ అయిన ఈ కమెడియన్.. ఈ మధ్య మళ్లీ జబర్దస్త్‌లో వరుస స్కిట్లు చేస్తూ అదరగొడుతున్నాడు. మరోవైపు సినిమాల్లో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఈటీవీ భారత్‌తో ముచ్చటించిన అతడు.. 'జబర్దస్త్'లోకి ఎంట్రీ ఇవ్వడం, తన సినీ ప్రయాణం మొదలైన విషయాలను గురించి తెలిపాడు.
"జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఆ షో గురించి నాకు తెలుసు. అప్పుడు వేణు, ధన్‌రాజ్, చంటితో పాటు నన్నూ అడిగేవారు. కానీ అప్పుడే 'అలా మొదలైంది' రిలీజై వరుస ఆఫర్లు రావడం వల్ల నాకు కుదరలేదు. చాలా బిజీ ఉన్నా. రెండేళ్లకోసారి బ్యాచ్‌లు మారినప్పుడు, ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టినప్పుడు కూడా మళ్లీ పిలిచారు. కానీ నాకు కుదిరేది కాదు. నిజానికి చేయడం ఇష్టం లేదు. అంటే టీవీకి వెళ్లకూడదు అని కాదు. అంతకుముందు 'మా' టీవీలో బ్యాండ్మేలం అనే షో చేశాను. ఒక్కరోజు డేట్ ఇస్తే రూ.మూడు వేలు ఇచ్చేవారు. అప్పుడు చాలా ఎక్కువ. నాకు రెమ్యునరేషన్ విని ఆశ్చర్యపోయేవారు! అలా సినిమాలు రాకముందు టీవీ షో చేశా."
-తాగబోతు రమేశ్
అలా ఎంట్రీ: "చంద్ర ప్లేస్‌లో నేను జబర్దస్త్‌లోకి వచ్చాను. అతను వెళ్లిపోయాడు అంటే అతని స్థానంలో సెలబ్రిటీలను పిలిచి స్కిట్ చేయించేవారు. కానీ అది టెలికాస్ట్ కాలేదు. డైరెక్టర్ని అడిగితే.. టీఆర్పీ ఆధారంగా షోను టెలికాస్ట్ చేస్తాము అన్నారు. అయితే అప్పటికే తాగుబోతు రమేశ్ అని ముద్రపడింది. ఎప్పుడు ఒకటే పాత్ర చేయడం ఎందుకులే అనిపించింది. అందుకే జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ షో ప్రసారమయ్యాక చాలా మంది ఫోన్ చేసి అభినందించారు. మంచి పేరు వచ్చింది. ఇక టీవీ ఆడియన్స్‌కు కూడా దగ్గర అవొచ్చనే ఉద్దేశంతో స్కిట్లు చేయడం కొనసాగించా." అని రమేశ్ అన్నాడు.
అందుకు ఫీలవుతున్నాను..: జబర్దస్త్‌కు తాను మొదట్లో నో చెప్పినందుకు ఇప్పుడు ఫీలవుతున్నాను అని అన్నాడు రమేశ్. ముందే వచ్చి ఉంటే కమర్షియల్‌గా ఇంకా సక్సెస్ అయ్యేవాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇలా స్కిట్లు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నాడు. " మొదట్లో నో చెప్పినందుకు చాలా ఫీలవుతున్నాను. ముందే వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ సక్సెస్ అయ్యేవాడినేమో. ఏ విషయమైనా టైం మీదనే ఆధారపడి ఉంటుంది. తాగబోతుగా నాకు టైం వచ్చింది బీజీగా ఉన్నా. కొన్ని సందర్భాల్లో గ్యాప్ వస్తుంది. ఆ విరామంలో టీవీకి వచ్చాను. వివిధ పాత్రలు చేశా. ఓ సారి యాంకర్ సుమ రోల్ చేశా. శ్రీదేవి డ్రామాలో చేశాను. ఇక్కడ నా జూనియర్స్తో పాటు కలిసి చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. " అని రమేశ్ పేర్కొన్నాడు.
ఇక్కడే ఎక్కువ కష్టం.. "సినిమా అంటే.. రెండు మూడు నెలల ముందే కథ చర్చ జరుగుతుంది. లొకేషన్‌కు రాగానే పేపర్ ఇస్తారు. అందులోని డైలాగులు చదువుకుని నటించాలి. ఈ టీవీ షోల్లో అలా కాదు. మనమే స్క్రిప్ట్‌లు, పంచ్‌లు తయారు చేసుకుని చేయాలి. సినిమాలతో పోలిస్తే ఎక్కువ కష్టపడాలి. అంతే పేరు కూడా వస్తుంది. అప్పట్లో థియేటర్‌కి వెళ్లి నవ్వుకునే రోజుల్లో.. టీవీ ద్వారా కూడా కడుపుబ్బా నవ్వుకోవచ్చని జబర్దస్త్ నిరూపించింది. ఈ షోను ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నా" అని రమేశ్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి: గతజన్మలో అక్కడే పుట్టానేమో!: సాయిపల్లవి