అడవి శేష్ కథానాయకుడిగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా 'మేజర్'. ప్రకాశ్ రాజ్, శోభిత, సయీ మంజ్రేకర్, రేవతి కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 'మేజర్' గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
- 26/11 ఉగ్ర దాడుల్లో పౌరుల ప్రాణాలను కాపాడుతూ అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్'ను తెరకెక్కించారు. "చాలా మందికి 'మేజర్' సందీప్ ఎలా చనిపోయాడో తెలుసు. కానీ, ఎలా జీవించాడో తెలియదు" అంటూ ఆ విషయాలన్నీ ఎంతో హృద్యంగా చూపించాలనే ఉద్దేశంతోనే 'మేజర్' తీశారు అడవి శేష్.
- ఇందులో టైటిల్ రోల్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను యువ నటుడు అడవి శేష్ పోషించగా, శశి కిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'గూఢచారి' తెరకెక్కింది.
- ఈ సినిమాకు 'మేజర్', 'మేజర్ సందీప్' అనే టైటిల్స్ అనుకున్నారు. చివరకు మొదటిదాన్నే ఖాయం చేశారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో మాట్లాడి, సినిమా తీసేందుకు అనుమతి తీసుకుంది.
- నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్‌చంద్రలు ఈ సినిమా గురించి అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబుకు చెప్పగా, ఆయన కూడా 'మేజర్' నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఇలాంటి సినిమాలో భాగస్వామిని కావడం నిజంగా సంతోషంగా ఉందని మహేశ్ అనేక వేదికలపై చెప్పారు.
- తెలుగుతో పాటు, ఉత్తరాది రాష్ట్రాలకు చేరువయ్యేలా ఏకకాలంలో ఈ సినిమాను హిందీలోనూ తెరకెక్కించారు. కరోనా కారణంలో కొన్ని రోజులు సినిమా చిత్రీకరణ వాయిదా పడింది.'మేజర్' మూవీ చిత్రీకరణకు 120 రోజుల సమయం పట్టింది. 75కు పైగా లొకేషన్ల, 8 భారీ సెట్లు వేసి చిత్రీకరణ జరిపారు.
- 'మేజర్' విడుదల సందర్భంగా చిత్ర బృందం వినూత్న ప్రచారానికి తెర తీసింది. ఎంపిక చేసిన నగరాల్లో కొంతమంది ప్రేక్షకుల కోసం ఈ సినిమాను ప్రదర్శించారు. విడుదలకు ముందే ప్రేక్షకుల కోసం ఓ సినిమాను ప్రదర్శించటం ఇదే తొలిసారి.
- 2008లో ఉగ్రదాడి జరిగినప్పుడు తొలిసారి 'మేజర్' సందీప్ గురించి అడవి శేష్ చూశారట. ఆయన్ను చూడగానే తన అన్నయ్యలా అనిపించారట. అప్పటి నుంచే ఆయన గురించిన కథనాలను, సమాచారాన్ని సేకరించటం మొదలు పెట్టారు.
- 'మేజర్' సందీప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అడవి శేష్ ఆయన తల్లిదండ్రులను కలిశారు. కొన్ని రోజులు వారితో కలిసి ప్రయాణం చేశారు. కొన్ని రోజులు అయిన తర్వాత సందీప్ తండ్రి మాట్లాడుతూ..'నువ్వు మా అబ్బాయి గురించి సినిమా తీయగలవని 10శాతం నమ్మకం కలిగింది' అనడంతో అందరూ నవ్వేశారట.
- అలా నాలుగైదు సార్లు బెంగళూరు వెళ్లి అడవిశేష్ సందీప్ తల్లిదండ్రులను కలిశారు. ఒకసారి వాళ్ల నుంచి బయటకు వచ్చి లిఫ్ట్ కోసం వేచి చూస్తుండగా సందీప్ తల్లి అడవి శేష్‌ను పిలిచి 'నా సందీప్‌లా ఉన్నావు' అన్నారట.
- 'మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం. ఆ పని చేసేటప్పుడు మన నిబద్ధత ఇవి రెండూ మేజర్ సందీప్ లక్షణాలు' అనుకుని సినిమా మొదలు పెట్టారట అడవి శేష్. అలా మొదలైన 'మేజర్' జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇదీ చూడండి : హాట్ పోజులతో కిక్కెక్కిస్తున్న ఆస్ట్రేలియా 'వీజే'.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా!