సినిమాల్లో ఎమోషనల్ సీన్స్ చూసి తానెప్పుడూ కంటతడి పెట్టుకోలేదని.. కానీ 'రాజీ' సినిమాలోని అలియా నటనకు ఏడ్చేశానంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి, రచయిత్రి సుధామూర్తి చెప్పారు. అలియా భట్ అద్భుతంగా నటించారని ఆమెను కొనియాడారు. ఇటీవల ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. అందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని కూడా వెల్లడించారు.
"థియేటర్లలో తొలిసారిగా 1958లో సినిమా చూశా. అప్పటి నుంచి వైజయంతీమాలను అభిమానించడం ప్రారంభించాను. ఇక నర్గిస్ నటననూ ఇష్టపడతాను. ఈతరంలో అయితే అలియా భట్ నటనను అభిమానిస్తాను. ఆమె గ్రేట్ యాక్టర్" అని పేర్కొన్నారు. అంతే కాకుండా తరచూ సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్, సంగీతం గురించి తమ ఇంట్లో చర్చించుకుంటుంటామని సుధా మూర్తి తెలిపారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన 'రాజీ' సినిమాలో అలియా భారత్ కోసం పనిచేసే ఓ గూఢచారి పాత్రలో ఒదిగిపోయింది. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 190 కోట్లకు మేర వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లోనూ 15 నామినేషన్లలో పోటీ పడిన ఈ సినిమా అందులో 5 అవార్డులు దక్కించుకుంది. వాటిల్లో ఉత్తమ నటి పురస్కారం కూడా ఒకటి కావడం విశేషం.
అలియా ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జులై 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో ఆలియా సరసన బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించారు. కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరోవైపు అలియా నటించిన హాలీవుడ్ మూవీ 'హార్ట్ ఆఫ్ స్టోన్'.. ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్' లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.