Anupam Kher In Tiger Nageswararao movie: స్టూవర్ట్‌పురం దొంగగా పోలీస్ రికార్డులకెక్కిన 'టైగర్ నాగేశ్వరరావు' జీవిత కథ ఆధారంగా.. అదే పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ కథానాయకుడు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పకులు. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్‌ని ఎంపిక చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి.
''రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఇదివరకెన్నడూ చేయని పాత్రలో ఆయన కనిపిస్తారు. గెటప్, సంభాషణలు పలికే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమా కోసం రూ.7 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దాం. అనుపమ్ ఖేర్ సినిమాకి ప్రధానబలం. మేం నిర్మించిన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మరోసారి ఈ చిత్రంలో ఆయన నటిస్తుండడం ఆనందంగా ఉంది. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాని రూపొందిస్తున్నామ''ని నిర్మాణ వర్గాలు తెలిపాయి.
ఎన్టీఆర్ వేగం పెంచనున్నారా?..
'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేయనున్న కొత్త సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. చాలా రోజులుగా స్క్రిప్ట్ దశలోనే ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఆ సినిమా చిత్రీకరణ మొదలు కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. కథానాయిక ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. అయితే ఎన్టీఆర్ ఇక నుంచి వేగం పెంచి సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయన చేయనున్న ఇతర సినిమాలకి సంబంధించి ఆయా దర్శకులతో కథా చర్చలు షురూ చేసినట్టు తెలుస్తోంది.
తమిళ దర్శకుడు వెట్రిమారన్ - ఎన్టీఆర్ కలయికలో సినిమా ఎప్పట్నుంచో చర్చల్లో ఉంది. ఇటీవలే ఇద్దరూ కలిసి కథ విషయంలో చర్చలు జరిపినట్టు సమాచారం. మరోపక్క బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్క్రిప్ట్ కూడా శరవేగంగా సిద్ధమవుతోంది. ఇటీవలే తన గురువు సుకుమార్‌తో కలిసి ఆ స్క్రిప్ట్‌పై కసరత్తులు మొదలు పెట్టారు బుచ్చిబాబు. కొంచెం వ్యవధిలోనే రెండు సినిమాల్ని పట్టాలెక్కించి వడివడిగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కలయికలోనూ ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: పాన్ ఇండియా కొత్తేమి కాదు.. ఎప్పటి నుంచో నేను..'
'నాటు నాటు' రీక్రియేషన్.. ఈ సిస్టర్స్ స్టెప్పులకు యూట్యూబ్ ఫిదా!