స్టార్ హీరోల చిత్రాలకు కథానాయికల ఎంపిక అనేది ఎప్పుడూ కత్తి మీద సాములాంటి వ్యవహారమే. హీరోకి తగిన జోడి అనిపించాలి. వెనుక విజయాలు.. సినీప్రియుల్ని ఆకర్షించే గ్లామర్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సదరు నాయికని ఎంపిక చేస్తే మార్కెట్ పరంగా సినిమాకి ఏమేర కలిసొస్తుందో లెక్కలేసుకోవాలి. ఇలా బోలెడన్ని సమీకరణాలతో ముడిపడి ఉంటుంది నాయికల ఎంపిక ప్రక్రియ. అందుకే స్టార్ హీరోల సినిమాలకు కథానాయికల్ని వెతికి పట్టుకోవడం అంత త్వరగా తేలదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు.
కొత్త అందాలకు పట్టుగొమ్మ తెలుగు చిత్రసీమ. తెలుగు తెరపైకి ఏటా వందల సంఖ్యలో కొత్త నాయికలు వస్తున్నా.. వారిలో హిట్టు మాట వినిపించి, స్టార్ హోదాకి చేరుకునే వారు ఒకరిద్దరే. అందుకే స్టార్ హీరోల చిత్రాల్ని నాయికల కొరత ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై కొన్ని నెలల క్రితమే అధికారిక ప్రకటన వెలువడింది.
'జనతా గ్యారేజీ' లాంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ నుంచి వస్తున్న రెండో చిత్రమిది. యాక్షన్ ప్రధానంగా సాగే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం నాయికగా అలియా భట్‌ను రంగంలోకి దించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. ఈ విషయాన్ని అప్పట్లో అలియా సైతం ధ్రువీకరించింది. కానీ, ఇప్పుడామె గర్భిణి కావడంతో ఈ చిత్రాన్ని వదులుకుంది. దీంతో ఇప్పడీ సినిమా కోసం మరో నాయికను వెతికి పట్టుకునే పనిలో ఉంది చిత్ర బృందం. వచ్చే నెలాఖరు నాటికి సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈలోగా చిత్ర నాయికపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సోనాక్షికి అవకాశం దక్కేనా?
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం ఖరారైంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా.. అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణకు కూతురిగా శ్రీలీల కనిపించనుంది. మరో కీలక పాత్ర కోసం ప్రియమణిని తీసుకోనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడీ పాత్ర కోసం ఓ బాలీవుడ్ భామను రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ప్రస్తుతం సోనాక్షి సిన్హాతో పాటు మరో హిందీ భామ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఈ అవకాశం వారిలో ఒకరికి దక్కుతుందా? లేదా మరెవరైనా దక్షిణాది భామని వరిస్తుందా? అన్నది వేచి చూడాలి.
ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు కథానాయకుడు మహేష్‌బాబు. ఇది పూర్తయిన వెంటనే ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. వచ్చే ఏడాది పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే నాయికల ఎంపిక ప్రక్రియ మొదలైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దీపిక పదుకొణేతో పాటు పలువురు స్టార్ నాయికల పేర్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇది తేలడానికి మరింత సమయం పట్టే అవకాశముందని సమాచారం.
ఇటీవలే 'ది వారియర్' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు రామ్. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకీ నాయిక ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రష్మిక, పూజా హెగ్డే వంటి నాయికల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం వినిపిస్తోంది. కానీ, ఇంత వరకు దేనిపైనా స్పష్టత రాలేదు.
రవితేజకు జోడీ ఎవరు?
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు రవితేజ. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'ధమాకా', 'రావణాసుర', 'టైగర్' చిత్రాలు సెట్స్‌పై తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇక త్వరలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడీ సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్‌తో పాటు పలువురు కుర్ర నాయికల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై వచ్చే నెలాఖరు నాటికి స్పష్టత వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అతీంద్రీయ అంశాలతో కూడిన ఈ కథలో రవితేజ విభిన్నమైన లుక్‌తో కనిపించనున్నారు.
ఇవీ చదవండి: ఈ చిన్నారి కుర్రాళ్ల మనసు దోచిన హీరోయిన్.. నేషనల్ అవార్డు గ్రహీత కూడా
సన్నీలియోని-అమలపాల్-కృతిశెట్టి హాట్ ట్రీట్.. చూస్తే చూపు తిప్పుకోరంతే!