Sharwanand Marriage : టాలీవుడ్ హీరో శర్వానంద్ అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. రక్షితా రెడ్డి అనే యువతితో ఏడు అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థం ఈ ఏడాది ప్రారంభంలో గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. అయితే వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ ఇటీవలే పుకార్లు కూడా వచ్చాయి. అయితే, వాటిని హీరో టీమ్ కూడా ఖండించింది. ఇప్పుడు తాజాగా వీరి పెళ్లి డేట్‌ను కుటుంబ సభ్యులు ఖరారు చేశారు. దానికి సంబంధించిన వివరాలను తెలిపారు.
డెస్టినేషన్ వెడ్డింగ్.. శర్వానంద్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారట. అయితే ఈ వెడ్డింగ్ ఈవెంట్ విదేశాల్లో కాదు ఇక్కడేనట. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌లో వీరి వివాహాం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్‌గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ వెడ్డింగ్ ఈవెంట్‌కు స్నేహితులు, ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులకు ఆహ్వానం అందనున్నట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పెళ్ళికి హాజరు కానున్నారట. కాగా, పెళ్లి తేదీలను ఖరారు చేయడం వల్ల.. ప్రస్తుతం సోషల్ మీడియాలో శర్వానంద్ పేరు ఫుల్ ట్రెండ్ అవుతోంది. దీంతో కాబోయే నూతన వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
రక్షిత ఎవరంటే?.. హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ప్రస్తుతం ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టు న్యాయవాది. అంతే కాదు... ఆమె ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనమరాలు కూడా!
వరుస సినిమాలతో బిజీ బిజీ.. శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన చివరిగా నటించిన 'ఒకే ఒక జీవితం' బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. కానీ మంచి వసూళ్లనే అందుకందట. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయిక. దీంతో పాటే రవితేజతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తారని వినికిడి. ఇందులో లెక్చరర్‌గా రవితేజ, ఆయన శిష్యుడిగా స్టూడెంట్ రోల్లో శర్వానంద్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తారట.
ఇదీ చూడండి: మలయాళీ సినిమా రికార్డ్.. రూ.15కోట్ల బడ్జెట్.. పది రోజుల్లోనే రూ.100కోట్లు