Rocketry Madhavan ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్'. హీరో మాధవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఆయనే ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను అందుకుంది. అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోయి చిత్రయూనిట్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరూ ఈ చిత్రంపై, ఇందులో నటించిన మాధవన్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే మాధవన్ రాకెట్రీ సినిమా బడ్జెట్ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటినే అమ్మేశాడంటూ ఓ వార్త వైరల్ అయింది.
తాజాగా ఈ విషయమై ట్విటర్ ద్వారా మాధవన్ స్పందించారు. ఈ మూవీ కోసం ఇల్లు అమ్ముకోవడం కాదు కదా.. నిజానికి మంచి లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పారు. "ఓ యార్. దయచేసి నా త్యాగాన్ని మరీ ఎక్కువ చేసి చూపించకండి. నా ఇల్లే కాదు ఏమీ కోల్పోలేదు. నిజానికి ఈ రాకెట్రీ మూవీ కోసం పని చేసిన అందరూ చాలా గర్వంగా ఎక్కువ ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టారు. దేవుడి దయ వల్ల మేమందరం మంచి లాభాలు అందుకున్నాం. నేను ఇప్పటికీ నా ఇంట్లోనే ఉంటున్నాను" అని మాధవన్ ట్వీట్ చేశాడు.
రాకెట్రీ సినిమా.. ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోపిక్. ఇండియాకు క్రయోజనిక్ ఇంజిన్ల ప్రాముఖ్యతను చెప్పి, ఇస్రోకు ఎన్నో దశాబ్దాల పాటు సేవలందించిన గొప్ప సైంటిస్ట్ నంబి. కొంతమంది చేసిన కుట్రల కారణంగా జీవితంలో ఎంతో కోల్పోయారు. అయితే అది ఎవరు చేశారన్నది స్పష్టంగా తెలియరాలేదు. 1994లో ఈ ఘటన జరిగింది. దీనిపై ఆయన న్యాపపరంగా 24 ఏళ్ల పాటు పోరాడి గెలిచారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది.
ఇదీ చూడండి: షూటింగ్లో గాయపడ్డ నటుడు నాజర్, ఆస్పత్రికి తరలింపు