Godfather Producer: "అందరూ చూసిన ఓ రీమేక్ కథను తీసుకొని.. దాన్ని చక్కగా మార్పులు చేసి..ప్రేక్షకుల మెచ్చేలా తీయడమన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా సాహసంతో కూడుకున్నది. ఈ విషయంలో 'గాడ్‌ఫాదర్' చక్కగా సక్సెస్ అయ్యింద"న్నారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మోహన్ రాజా తెరకెక్కించారు. ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది.
ఈ నేపథ్యంలోనే బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. "ఈ చిత్రాన్ని మేము ఎవరికీ అమ్మలేదు. సొంతంగా విడుదల చేశాం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి సినిమాకి మంచి ఆదరణ దక్కుతోంది. మేము ఊహించిన దాని కన్నా ఎక్కువగా వసూళ్లు దక్కుతున్నాయి. ఎంతో గర్వంగా ఫీలవుతున్నాం. వాస్తవానికి 'లూసీఫర్'ను అందరూ చూశారు. చిరంజీవి చేస్తున్నారని తెలిశాక ఇంకా చాలా మంది చూశారు. అలాంటి కథను తీసుకొని.. సరికొత్తగా మార్పులు చేసి.. విజయం సాధించడం మామూలు విషయం కాదు. పెద్దగా పబ్లిసిటీ చేయకున్నా.. హిందీలో తొలి వారంలోనే రూ.10కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.60కోట్ల షేర్ వచ్చింది. విదేశాల్లోనూ వసూళ్లు బలంగా ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 2మిలియన్ల మార్క్ టచ్ అయ్యింది. ఈ సినిమా విషయంలో మోహన్ రాజా చాలా కష్టపడి అద్భుతమైన మార్పులు చేశారు. తమన్ తన అద్భుతమైన సంగీతంతో సినిమాకి ఆరో ప్రాణంలా నిలిచారు. సమష్ఠి కృషి వల్లే ఇలాంటి విజయం సాకారమైంది. ఇలాంటి విజయాలు వచ్చినప్పుడే ఎగ్జిబిటర్ వ్యవస్థ నిలుస్తుంది" అన్నారు.