మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. 'ఆచార్య' సినిమా కోసం హైదరాబాద్ కోకాపేట్లో వేసిన 'ధర్మస్థలి' అనే సెట్లో నుంచి సోమవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో సెట్లో ఎవరు లేనందున ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
కాగా, సినిమాలోని ధర్మస్థలి అనే ఊరు కోసం వేసిన ఈ భారీ సెట్లో.. సినిమాలోని పలు సన్నివేశాలను అక్కడే చిత్రీకరించారు. 'భరత్ అనే నేను' సినిమాకు పని చేసిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సెల్వ రాజన్ ఈ సెట్‌ను డిజైన్ చేశారు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా.. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' లోని పలు సీన్స్ కూడా ఈ 'ధర్మస్థలి' సెట్లోనే షూట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక 'ఆచార్య' సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో.. పూజా హెగ్డే కథానాయిక. 2022 ఏప్రిల్ 29న విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. అయితే భారీ బడ్జెట్‌తో వేసిన ఈ సెట్ మాత్రం సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అంతే కాకుండా ఈ సెట్‌ను పలు సినిమాల చిత్రీకరణకు వాడుకున్నట్లు సమాచారం.