ప్రముఖ గాయని వాణీజయరాం అంత్యక్రియలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్ర అధికారిక లాంఛనాలతో మధుర గాయనికి కడసారి వీడ్కోలు పలికారు. బేసంట్నగర్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్.. వాణీజయరాం నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వాణీజయరాం కన్నుమూశారనే విషయం తెలిసి దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. 'వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు ప్రకటించింది. దురదృష్టవశాత్తు ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు.
శనివారం చెన్నైలోని ఆమె నివాసంలో వాణీజయరాం తుదిశ్వాస విడిచారు. మధుర గాయనిగా పేరుతెచ్చుకున్న వాణీజయరాం 19 భాషల్లో.. 10 వేలకు పైగా పాటలు పాడారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వాణీజయరాం మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.