'నిర్మాణ వ్యయం ఎక్కువే అయినా.. ఇంటిల్లిపాదీ కలిసి చూడాల్సిన చిత్రం ఎఫ్3. అందుకే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించేలా నిర్మాత దిల్‌రాజు నిర్ణయం తీసుకున్నారు. కచ్చితంగా ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్‌కి తీసుకొస్తుందీ చిత్రం. ‘ఎఫ్2’ని మించిన వినోదాన్ని ఇందులో ఆస్వాదిస్తార'ని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ‘ఎఫ్2’తో వెంకటేష్, వరుణ్‌తేజ్‌లని కో బ్రదర్స్‌గా చూపించి నవ్వించారు. మరోసారి అవే పాత్రలతో ‘ఎఫ్3’ని తీశారు. తెలుగులో వస్తున్న ఫ్రాంచైజీ చిత్రమిది. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు కొత్త. ‘ఎఫ్3’ తీయాలనుకున్నప్పుడు మీ మనసులో మెదిలిన ఆలోచనలేమిటి?
కామెడీ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. నవ్వించిన సినిమాలు తిరస్కారానికి గురైన దాఖలాలే లేవు. వాళ్లకి వినోదం పంచితే చాలు. తెలుగులో ఫ్రాంచైజీ కొత్తే కానీ... బాలీవుడ్‌లో ‘గోల్‌మాల్’ సినిమాల తరహాలో మనకీ నవ్వుకోవడానికి ఓ సిరీస్ ఉండాలని చేస్తున్న ప్రయత్నమే ఈ సినిమాలు. కథపరంగా ‘ఎఫ్2’ కంటే ఎక్కువగా కసరత్తులు చేశాం.
‘ఎఫ్2’ కథని కాకుండా... ఆ ప్రాతల్ని మాత్రమే తీసుకోవడానికి కారణమేమిటి?
కొత్త కథని చెప్పాలనుకున్నాం. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిన అంశాలతోనే ఆ కథ సాగుతుంది. ‘ఎఫ్2’లో భార్యాభర్తల మధ్య ఫన్, ఫ్రస్ట్రేషన్ అయితే... ఇందులో డబ్బు గురించి వచ్చే ఫ్రస్ట్రేషన్. ఇది ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అంశం. డబ్బు చుట్టూ ఉండే ఆశ, అత్యాశ, కుట్ర, మోసం ఇవన్నీ చాలా బాగా పండాయి. తొలి సినిమా విజయవంతం కావడంతో ఇందులో మరింత ఉత్సాహంగా నటించారు. సునీల్, మురళీశర్మ, అలీ...ఇలా కొత్తమంది కొత్తనటులూ తోడయ్యారు. ఎక్కువ గ్లామర్‌తోపాటు, ఎక్కువ వినోదంతో సాగుతుందీ చిత్రం. ప్రతి పాత్ర కూడా అత్యాశతో కనిపిస్తుంది. ఎంత ఫన్ ఉంటుందో, అంత కథ ఉంటుంది. డబ్బు గురించి ఇందులో చెప్పిన నిజాలు ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతాయి.
‘ఎఫ్3’ అనగానే మరో హీరో కూడా కనిపిస్తారేమో అని ఆశించారంతా. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మూడో హీరో ఆలోచన ఉందా?
ఆ ఆలోచన కూడా వచ్చింది. అయితే అది అప్పుడే వాడేస్తే తర్వాత సినిమాలకి ఏమీ ఉండదనిపించింది. అందుకే ఆ ఆలోచనని పక్కనపెట్టి ‘ఎఫ్2’ తారలతోనే వీలైనంత వినోదాన్ని సృష్టించాం. ‘ఎఫ్4’లో కానీ, ఆ తర్వాత సినిమాల్లో కానీ మూడో హీరో తప్పకుండా వస్తాడు. అయితే ‘ఎఫ్2’లో ఉన్న పాత్రలకీ, ఇందులో పాత్రలకీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. తొలి సినిమాలో వెంకటేష్‌కి కుటుంబం అంటూ లేదు. ఇందులో ఉంటుంది. వరుణ్‌కి అక్కడ కుటుంబం ఉంటుంది, కానీ ఇందులో ఉండదు. కరోనా రెండో దశ తర్వాత కథానాయిక పూజా హెగ్డేతో ఓ పాట చేయించాలని నిర్ణయించాం. కథలోకి పూజాహెగ్డేలానే వచ్చి సెలబ్రేషన్స్ పాటలో ఆడిపాడుతుందామె.
అంత మంది నటులతో కలిసి పనిచేయడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
మా సెట్లో కారవాన్‌లన్నీ చూస్తే మినీ మియాపూర్ బస్ డిపోలా ఉండేది. అంతమంది నటులు రోజూ సెట్‌కి వచ్చేవాళ్లు. ఎవరు ముందు వస్తే వాళ్ల సన్నివేశాల్ని తీసి పంపించడమే. అన్నపూర్ణమ్మ, వై.విజయ టైమ్ అంటే టైమే. వాళ్లు ఉదయం 8 గంటలకే వచ్చేవాళ్లు. అలాంటి క్రమశిక్షణ కలిగిన నటుల్ని నేను చూడలేదు. కరోనా సమయంలో వాళ్ల విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకున్నాం. సునీల్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. పదేళ్ల తర్వాత ఆయన కడుపుబ్బా నవ్వించే మరో మంచి పాత్ర చేశారు. అలీ సైతం అద్భుతమైన పాత్రలో కనిపిస్తారు. దేవిశ్రీప్రసాద్‌తో ఇది నాకు మూడో సినిమా. పాటల ఆల్బమ్‌తోపాటు, నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంటుంది. దిల్‌రాజుతో సినిమా అంటే సొంత సంస్థలో సినిమా అన్నట్టే ఉంటుంది. అందుకే ఆయనతో నా ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంది.
బాలకృష్ణతో సినిమా ఎలా ఉంటుంది? ఎప్పుడు మొదలవుతుంది?
సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళతాం. బాలకృష్ణ ఎంత శక్తివంతంగా కనిపిస్తారో, అందుకు తగ్గట్టే సినిమా ఉంటుంది. మేమిద్దరం కలిసి ఓ కొత్త రకమైన కథని చేస్తాం.
చాలా మంది నటులుండగా, కథానాయకుల పాత్రల్ని రేచీకటి, నత్తి బాధితులుగా చూపించడానికి కారణమేమిటి?
వినోదం మోతాదు పెంచడానికే. ‘ఎఫ్3’కి వచ్చేసరికి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మామూలు పాత్రకంటే ఇలాంటి పాత్రలతో ఎక్కువగా వినోదం సృష్టించే అవకాశం ఉంటుందనిపించింది. అందుకే ఆ పాత్రల్ని అలా డిజైన్ చేశాం. రాత్రివేళల్లో వచ్చే సన్నివేశాల్లో మాత్రమే వెంకటేష్ అలా రేచీకటితో వినోదం పండిస్తారు. వరుణ్‌తేజ్ నత్తికి తగ్గట్టుగా మేనరిజమ్‌ని డిజైన్‌చేయడం ఓ సవాల్‌గా అనిపించింది. ముప్పై రకాల మేనరిజమ్స్‌తో తెరపై కనిపిస్తాడు. జంధ్యాల ‘అహనా పెళ్లంట’ సినిమా ప్రేరణతో వరుణ్ పాత్రని డిజైన్ చేశా.
హాస్య ప్రధానమైన సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. జంధ్యాల, ఈవీవీ స్థానాన్ని భర్తీ చేయాలనేనా?
ప్రస్తుతానికి మన పరిశ్రమలో ఖాళీగా ఉన్న స్థానం అంటే అదే. నేను కూడా మాస్ సినిమాలు చేయాలనే వచ్చా. కామెడీ ఉంటేనే నా సినిమా పరిపూర్ణం అవుతోందనే భావన కలిగింది. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’... ఈ మూడు సినిమాల్లో ఎంత మాస్ వుందో, అంత కామెడీ కూడా పండింది. అయితే ఇంకా విస్తృతమైన పరిధిలో ప్రేక్షకులకు చేరువ కావాలనే ‘ఎఫ్2’ చేశా. ఒక ప్రణాళిక ప్రకారమే చేసిన ఈ సినిమాతో నాకు కామెడీ బ్రాండ్ వచ్చేసింది. దాన్ని సరిచేసుకోవడానికే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రైలు ఎపిసోడ్ పెట్టాం. ఇప్పుడు ‘ఎఫ్3’తో మళ్లీ కుటుంబ కథ చేశా. తర్వాత బాలకృష్ణ సినిమాతో మళ్లీ మాస్ పంథాలో వెళ్లబోతున్నా. ఇలా ప్రతీ సినిమాకీ వైవిధ్యం ఉండాల్సిందే. ఈ ప్రయాణం నాకూ హాయిగా, ఆరోగ్యంగా ఉంటోంది.
హీరోలు ఇమేజ్ నుంచి బయటికొచ్చి ఇలాంటి పాత్రలు చేయడం అరుదు. మీరు ఈ ఆలోచన చెప్పినప్పుడు వాళ్ల స్పందన ఏమిటి?
కొన్ని సినిమాలు చేయడానికి ఇమేజ్‌ని దాటి రావాల్సిందే. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్, సల్మాన్‌ఖాన్‌లాంటి హీరోలు అదే చేస్తున్నారు. వెంకటేష్ కూడా ఈ సినిమా కోసం పరిమితులేమీ పెట్టుకోకుండా నటించారు. కామెడీ చేసేటప్పుడు అలానే ఉండాలి. ఈ పాత్రల గురించి చెప్పినప్పుడు హీరోలిద్దరూ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాకి వచ్చేసరికి వాళ్లిద్దరూ మరింత సాన్నిహిత్యంతో కలిసి పనిచేశారు. వాళ్ల నటన ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది.
ఇదీ చదవండి: నాని.. మొన్న మహేశ్‌తో.. ఇప్పుడు ఎన్టీఆర్‌తోనా!