Dongalunnaru Jagratha : సర్వైవల్ థ్రిల్లర్లు హాలీవుడ్‌లో విరివిగా వస్తుంటాయి. బాలీవుడ్‌లోనూ కొన్ని వచ్చాయి. ఇప్పుడీ జానర్‌ను 'దొంగలున్నారు జాగ్రత్త'తో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది" అన్నారు శ్రీ సింహ కోడూరి. 'మత్తువదలరా' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించిన కథానాయకుడాయన. ఇప్పుడు 'దొంగలున్నారు జాగ్రత్త'తో థ్రిల్ పంచేందుకు సిద్ధమయ్యారు. సతీష్ త్రిపుర తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శ్రీ సింహ.
- "చాలా కొత్త కథ ఇది. ఎక్కడా సాగదీత లేకుండా బలమైన స్క్రీన్‌ప్లేతో చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్‌గా కథ రాసుకున్నారు దర్శకుడు సతీష్. నేనిందులో దొంగగా కనిపిస్తా. ఒక దొంగగా వచ్చిన వ్యక్తి చివరికి ఎలా మారాడు? తన తప్పుల్ని ఎలా తెలుసుకున్నాడు? అనేది సినిమాలో అద్భుతంగా చూపించారు. దీంట్లో దొంగని చూస్తే చిరాకొస్తుంది. అదే సమయంలో అతను తప్పు తెలుసుకున్నప్పుడు జాలి కూడా కలుగుతుంది. ఈ కథంతా ఒకే ప్రాంతంలో జరుగుతున్నట్లున్నా.. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగానే ఉంటుంది. బలమైన కథ ఉండటం వల్ల ఈ సినిమా నాకెక్కడా సవాల్‌గా అనిపించలేదు".
- "ఈ కథ దాదాపు ఓ కారులో.. ఒకే లొకేషన్లో జరుగుతుంటుంది. అలాగని సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఒకే లొకేషన్ చూస్తున్నామన్న ఫీల్ ఎక్కడా కలగదు. ఈ విషయంలో కెమెరా డిపార్ట్‌మెంట్ చాలా కష్టపడింది. ఒక గదిలో షూట్ అంటేనే కెమెరా యాంగిల్స్‌కు అంత అవకాశం దొరకదు. అలాంటిది ఒక కారులో అంటే చాలా సవాల్‌గా అనిపిస్తుంది. అయితే మా కెమెరామెన్ యశ్వంత్ ఈ పనిని చాలా అద్భుతంగా చేసి చూపించాడు. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఓ కారును సిద్ధం చేశాం. ఆ కారుని ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసి పెట్టే విధంగా డిజైన్ చేశాం. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు కొన్ని వర్క్‌షాప్స్ చేశాం. ఓ గంట కారులో ఉండిపోతే ఎలా ఉంటుంది? ఒక పూటంతా ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? అని రకరకాల రిహార్సల్స్ చేశాం".
- "ఒకే జానర్లో సినిమాలు చేయాలని నేనెప్పుడూ అనుకోను. మంచి బిగితో ఆసక్తికరంగా సాగుతుంది అనిపిస్తే ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా చేసేస్తాను. రాజమౌళితో సినిమా చేయడం నా కల. కానీ, అప్పుడే దాన్ని ఆశించకూడదు. నా స్థాయి ఏమిటో నాకు తెలుసు. ఆయనతో సినిమా చేసే స్థాయికి ఎదగడానికి నాకు చాలా సమయం ఉంది. ప్రస్తుతం నేను నటించిన 'భాగ్ సాలే' విడుదలకు సిద్ధంగా ఉంది. 'ఉస్తాద్' సినిమా చిత్రీకరణ దశలో ఉంది".
ఇదీ చదవండి: ఓరి దేవుడా.. విశ్వక్ సేన్ హీరోయిన్ భలే ఉందిగా!
బాహుబలి రేంజ్ సినిమాలో బాలయ్య.. దాదాపుగా షూటింగ్ పూర్తి.. కానీ!