ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫేమ్‌ను సృష్టించుకున్నారు దర్శకుడు మారుతి. త్వరలో స్టార్హీరోలతో సైతం సినిమాలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో గోపిచంద్, రాశీఖన్నా జంటగా రానున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. జులై 1న విడుదలవతున్న సందర్భంగా ఈ చిత్ర విశేషాలు, అగ్ర హీరోలతో చేయబోయే సినిమాల గురించి మాట్లాడారాయన..
స్టేజి మీద మెగాస్టార్ మీతో సినిమా చేస్తానని చెప్పారు..ఎలా ఫీలవుతున్నారు?
మారుతి: చాలా ఆనందంగా అనిపించింది. ఒకసారి నేనూ యూవీ క్రియేషన్స్ విక్కీ కలిసి చిరంజీవి గారిని కలిశాం. ఆ నేపథ్యంలోనే ఆయన నిన్న స్టేజిపై ప్రకటించారు. అంత పెద్ద హీరో అలా చెప్పడం నిజంగా నాకు, నాలాంటి దర్శకులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పర్సనల్‌గా నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది.
మరి ఆయన కోసం ఏదైనా స్టోరీ తయారు చేసుకున్నారా?
మారుతి: స్టోరీలు సిద్ధంగా ఉన్నాయి. వాటిపై చర్చలు కూడా పూర్తయ్యాయి. నా దర్శకత్వంపై ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఏ పాత్ర అయినా చేయగలరు. 'చిరంజీవిగారిని మారుతీ ఎలా చూపిస్తాడు' అనే అంచనాలకు తగ్గకుండా సినిమా తీస్తాను.
నిన్న గోపిచంద్ కూడా 'మారుతీ చాలా గొప్ప దర్శకుడు కచ్చితంగా నెక్ట్స్ లెవెల్ కి వెళతాడు' అన్నారు..దీనికి మీ సమాధానం?
మారుతి: ఫస్ట్.. నాలో దర్శకుడి కంటే ప్రేక్షకుడిని ఎక్కువ నమ్ముతా. ప్రేక్షకులను సంతృప్తి పరిస్తేనే దర్శకుడికైనా, నిర్మాతకైనా అతనివ్వాల్సిన హిట్ ఇస్తాడు. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడంతో ప్రేక్షకుల నాడి తెలుసుకోగలిగాను. ప్రేక్షకుడికి, నిర్మాతకు మధ్యవర్తిగా దర్శకుడిపై చాలా బాధ్యత ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ బాధ్యత ఇంకా పెరిగింది. ఈ బిజీ ప్రపంచంలో ముందు సినిమాను చూసే విధంగా చేయడమే దర్శకుడికి ఉన్న అతి పెద్ద సవాల్. ఆ చూసే సినిమాలో ప్రేక్షకుడికి కావాల్సిందే నేనివ్వాలి. నేను ఒక సినిమా తీస్తే, ప్రేక్షకుడు వంద సినిమాలు చూస్తాడు. అందుకే ముందు నేను ప్రేక్షకుడి జడ్జిమెంట్‌నే నమ్ముతా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రభాస్-మారుతి కాంబినేషన్‌పై అభిమానుల్లో జరుగుతున్న చర్చలకు మీ జవాబు ఏంటి?
మారుతి: అవును...త్వరలో ప్రభాస్‌తో సినిమా ఉంటుంది. ఆ విషయంపై చర్చించాం కూడా. ఇక ప్రేక్షకుల అంచనాలు, వారి ఊహాగానాలు తెలిసిందేగా.. కచ్చితంగా దానిపై ప్రకటన ఉంటుంది. ఆడియన్స్ ప్రభాస్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో ఆ స్థాయిలోనే చూపిస్తా.
అయితే పాన్ ఇండియా సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట! ఏ జోనర్‌లో ఉంటుంది?
మారుతి: ప్రభాస్‌తో సినిమా కాబట్టి కచ్చితంగా నాతో పాన్‌ఇండియానే తీయించుకుంటారు (నవ్వుతూ) అది ఏ జోనర్‌లో ఉంటుంది? టైటిల్ ఏంటి? అనే వివరాలని త్వరలో వెల్లడిస్తాం.
ఈ మధ్య కాలంలో మీరు తీసిన 'మంచి రోజులొచ్చాయ్' సినిమా ఫలితంపై మీ స్పందన ఏంటి?
మారుతి: అది ఒక ప్రయోగాత్మక చిత్రం. పరిమిత హద్దులతో తీసిన సినిమా. ఆ సినిమా ఎలాంటి విజయం సాధించాలో, అంతకుమించే సాధించింది. కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని ఇచ్చింది.
'పక్కా కమర్షియల్' టైటిల్ వెనుక ఉద్దేశం ఏంటి?
మారుతి: ఈ సినిమా చూసి ప్రేక్షకుడు పొందే అనుభూతిని మార్చడం కోసం. నాలుగు పాటలు, ఆరు ఫైట్‌లు, ఒక ఐటెమ్ సాంగ్ ఉన్న ప్రతి సినిమాని పక్కా కమర్షియల్ సినిమాగా ప్రేక్షకుడు అనుకున్నపుడు ఆ విషయాన్ని నేను ముందే చెప్పడం మంచిదనుకున్నాను. కానీ, దాన్ని మించి వేరే ఏదో ఉంది అనిపించేలా తీయడమే మారుతి స్పెషల్. 'ప్రేమ కథా చిత్రమ్' టైటిల్‌తో హారర్ సినిమా చూపించడాన్ని ప్రేక్షకులింకా మర్చిపోలేదు కాబట్టే నా సినిమాలకింకా ఆ ప్రత్యేకత ఉంది.
'పక్కా కమర్షియల్'లో గోపిచంద్ రోల్ ఎలా ఉంటుంది?
మారుతి: ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా గోపిచంద్ రోల్ ఉంటుంది. హీరోకి ఓ కొత్త రకమైన నెగెటివ్ షేడ్స్‌ని యాడ్ చేశాము. కమర్షియల్ హీరో అయిన గోపిచంద్‌ని మరింత కమర్షియల్‌గా చూపించబోయే సినిమా ఇది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది రవితేజకి సిద్ధం చేసిన కథ అని ప్రచారం జరుగుతోంది?
మారుతి: 'పక్కా కమర్షియల్' గోపిచంద్ కోసమే సిద్ధం చేసిన కథ. రవితేజకి వేరే కథని రెడీ చేశాను. భవిష్యత్‌లో ఆ ప్రాజెక్టూ ఉంటుంది.
'ప్రతిరోజు పండగే' టీం మొత్తాన్ని కంటిన్యూ చేయడానికి కారణం ఏంటి?
మారుతి: ఈ పాత్రలకి వారే న్యాయం చేస్తారన్న నమ్మకంతో..రావు రమేష్ గారిని ఇప్పటివరకు చూపించని రోల్‌లో చూపించాను. మన తెలుగులో చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వారిని సరిగ్గా వినియోగించుకోవాలి. దురదృష్టవశాత్తూ మన ఇండస్ట్రీ ఈ పదేళ్లలో బెస్ట్ కమెడియన్లు, ఆర్టిస్టులను కోల్పోయింది. వారి స్థానాన్ని భర్తీ చేసే ఆర్టిస్టులను మనం సిద్ధం చేయాలి. ప్రతి దర్శకుడు ఆ బాధ్యత తీసుకోవాలి.
ఈ మధ్య కాలంలో టిక్కెట్ రేట్ల వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి?
మారుతి: ఇది సున్నితమైన వ్యవహారం. టికెట్ రేట్లపై ముందు ప్రేక్షకులకు అవగాహన కలిగించాలి. ఇండస్ట్రీ పెద్దలు దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. సినిమా పరిమితులను బట్టే దానికి రేటు తగ్గించడం, పెంచడం జరుగుతుంది.
కంటెంట్ బాగున్న సినిమాలు ఆడట్లేదన్న ప్రచారం సాగుతోంది! దీనిపై మీరేమంటారు?
మారుతి: అలా ఏం ఉండదండీ. ఏ సినిమాకు ఎంత శాతం విజయాన్ని ఇవ్వాలో ప్రేక్షకులకు తెలుసు. వారికివ్వాల్సింది వారికిచ్చేస్తే మన సినిమాకు విజయాన్ని ఇస్తారు. 'విక్రమ్' సినిమా అంత విజయం సాధించింది అంటే అర్థం అదే కదా. మంచి సినిమా ఎప్పుడూ ఆడుతుంది. ఆడలేదంటే మనం ప్రేక్షకుడికి ఇవ్వాల్సింది ఏదో ఇవ్వలేకపోయామని సమీక్షించుకోవడమే.
ఈ శాటిలైట్, ఓటీటీల కాలంలో 'సక్సెస్' అనే పదానికి అర్థం మారిపోయిందంటారా?
మారుతి: ఎన్ని వచ్చినా ఎవరి అంచనాలు వారికి ఉంటాయి. ఓటీటీలో కూడా సినిమాకు ఆ సామర్థ్యం ఉందని నిరూపించుకున్నాకే కొంటున్నారు. ఓటీటీ ఉందని ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీసి దెబ్బ తిన్నవాళ్లు నిత్యం నాకు ఎదురవుతున్నారు. ప్రేక్షకుడికి నచ్చే సినిమా తీసేవారికి ప్లాట్‌ఫాంతో సంబంధం లేదు. ఏ ప్లాట్‌ఫాం అయినా ప్రేక్షకుడికి నచ్చితేనే 'సక్సెస్' అనే పదం వినిపిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'బాలీవుడ్‌ను మాఫియా ఏలింది.. నాకు అవకాశాలు లేకుండా చేసింది'