భారతీయ సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించతగిన దిగ్గజ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ ప్రస్థానం ముగిసింది. ఆయన లేడు... ఆయన సినిమా ప్రపంచానికి పాఠాలుగా అందించిన సినిమాలు ఉన్నాయంటూ సినీ లోకం ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మహా దర్శకుడికి కడసారి నివాళులర్పిస్తూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.
నిన్న రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచిన విశ్వనాథ్ పార్థివదేహానికి హైదరాబాద్ పంజాగుట్టలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కుమారులు నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్ లు తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం తండ్రికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతకుముందు ఫిల్మ్ నగర్ లోని నివాసం నుంచి సినీ ప్రముఖులు, అభిమానులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ఆశ్రు నయనాల మధ్య విశ్వనాథ్ అంతిమయాత్ర పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు కొనసాగింది. దారి పొడవున విశ్వనాథ్ చిత్రాలను అభిమానించే ప్రేక్షకులు ఆయనకు నివాళులర్పిస్తూ సినిమాలను గుర్తు చేసుకున్నారు. ఎంపీ సంతోష్, నటి తులసి, ఏపీ సినిమాటోగ్రఫి మంత్రితోపాటు పలువురు సినీ ప్రముఖులు శ్మశాన వాటికకు చేరుకొని కడసారిగా విశ్వనాథ్ కు నివాళులర్పించారు.
ఇదీ చూడండి: ఐదు నెలల్లో ఐదుగురు దిగ్గజాలు.. టాలీవుడ్‌ను వెంటాడుతున్న విషాదాలు