Director Pratap pothen died: సినీఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు, నటుడు ప్రతాప్ పోతెన్(70) కన్నుమూశారు. ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అయితే ఎలా మరణించారనే విషయమై వివరాలు తెలియలేదు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
ప్రతాప్ పోతెన్.. 1952 ఆగస్టు 13న జన్మించారు. తన 15ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. ముంబయిలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. సీనియర్ నటి రాధికను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ జంట విడిపోయారు. అనంతరం అమలా సత్యనాథ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఓ పాప ఉంది. 1978లో 'అరవం' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. మొత్తంగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీలో 100కుపైగా సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు, నిర్మాతగానూ చిత్రసీమలో తనదైన ముద్రవేశారు. 'ఆకలిరాజ్యం', 'కాంచన గంగ', 'జస్టిస్ చక్రవర్తి', 'చుక్కల్లో చంద్రుడు', 'మరో చరిత్ర', 'వీడెవడు' చిత్రాల్లో ఆయన సహాయనటుడిగా నటించి తెలుగువారికీ చేరువయ్యారు. ఈ 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన 'సీబీఐ'చిత్రంలో కనిపించారాయన. బెస్ట్ యాక్టర్‌గా పలు అవార్డులను అందుకున్నారు. 1985లో ఆయన దర్శకత్వం 'Meendum Oru Kaathal Kathai' చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది.
ఇదీ చూడండి: అల్లుఅర్జున్-హరీశ్‌శంకర్ కాంబో ఫిక్స్.. 'పుష్ప 2' కన్నా ముందే.. కానీ..