"నాకు మాస్.. మెలోడీ అనే తేడాల్లేవు. నాది ఒక్కటే జానర్. జనం జానర్. జనం ఇష్టపడే అన్ని రకాల పాటలు చేస్తాను" అన్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ఇప్పుడాయన 'ధమాకా'కు స్వరకర్తగా వ్యవహరించారు. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు భీమ్స్.
- "ఇదొక చక్కటి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇందులో రవితేజ ఇటు క్లాస్‌గా.. అటు మాస్‌గా రెండు పాత్రల్లో కనిపిస్తారు. దర్శకుడు త్రినాథరావు చిత్రాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయనపై మనకి ఓ విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని మరోసారి నిలబెట్టే చిత్రమిది. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు మంచి ఆదరణ లభించింది. మరో పాటను త్వరలో విడుదల చేస్తాం. దాన్ని నేనే రాసి.. స్వయంగా ఆలపించా".
- 'బెంగాల్ టైగర్' తర్వాత రవితేజతో చేస్తున్న రెండో చిత్రమిది. ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. రవితేజ నాకు గొప్ప నమ్మకాన్నిచ్చారు. వందేళ్ల తర్వాత కూడా దీన్ని మర్చిపోను. ఆయన రెండు పాత్రలకు తగ్గట్లుగానే పాటల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దాను. 'కిక్' చిత్రంలో "ఒరేయ్ ఆజామూ.. లగెత్తరో" అనే డైలాగ్ చాలా ప్రాచుర్యం పొందింది. ఈ సినిమాకి పాటలు చేస్తున్నప్పుడు చివరిలో అలాంటి ఏదోక మెరుపు ఉండాలనిపించింది. అందుకే ఓ పాట చివర్లో "ఓ సిసిరోలియో ఇంకోసారి దరువేసుకో" అని రవితేజతో హమ్ చేయించాం. నమ్మకంగా చెబుతున్నా.. 'బెంగాల్ టైగర్'కు మించిన ఆల్బమ్ 'ధమాకా' ".
- "రవితేజ ఎప్పుడూ మన ఇంట్లో మనిషిలానే ఉంటారు. ఆయన కోసం ప్రత్యేకంగా పాటలు చేయాల్సిన పనిలేదు. తన కటౌట్ చూసినా చాలు పాటలు పుడతాయి. ఇదేదో పొగడ్త కోసం చెప్పే మాట కాదు. ఆయన ఎదిగొచ్చిన నేపథ్యం అంత స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది".
- "చిన్న చిత్రమైనా.. పెద్ద సినిమా అయినా నా పని ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. నాపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. నా పనిని ఆనందించడమే నాకు తెలుసు. అలాగే దేన్నీ పెద్ద కష్టంగానూ అనుకోను. ఎందుకంటే పాట నా తల్లి, స్నేహితుడు. ఈ బిడ్డకు ఏం ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. నా కెరీర్‌లో కొంత విరామం వచ్చిన మాట వాస్తవమే. ఇప్పుడా లోటును భర్తీ చేసేలా పదిహేను చిత్రాలు చేస్తున్నా. వచ్చే ఏప్రిల్ కల్లా ఓ పది చిత్రాలు విడుదలవుతాయి".