'పొన్నియిన్ సెల్వన్'తో తమిళనాట మంచి విజయాన్ని అందుకున్నారు విక్రమ్. ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం కోసం రంగంలోకి దిగారు. 'చియాన్ 61'(వర్కింగ్ టైటిల్) పేరుతో ఈ సినిమా టెస్ట్ షూట్ మొదలైంది. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రెగ్యులర్ చిత్రీకరణ ఒకటి రెండు రోజుల్లో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. 1800సంవత్సరం నాటి కథతో పీరియాడిక్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. త్రీడీలో కూడా ఈ సినిమాని రూపొందిచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కూడా చాలా కీలకంగా ఉండనుంది. తమిళంతో పాటు హిందీలోనూ ఈ సినిమాని చిత్రీకరణ చేయనున్నారు.
84 మంది నూతన నటులతో.. ప్రియాంక డే, సాయితేజ గంజి, తన్వీర్, శివ గంగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'హసీన'. నవీన్ ఇరగాని తెరకెక్కిస్తున్నారు. ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఎండీ తన్వీర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆకాష్ లాల్, వశిష్ఠ నారాయణ, అభినవ్, శ్రేష్ఠ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో అడివి శేష్ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఇది మంచి నాయికా ప్రాధాన్య చిత్రం. 84మంది కొత్త నటీనటులతో రూపొందించడం విశేషం. టీజర్ చాలా బాగుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అన్నారు. ''స్నేహితులు చివరిదాకా వెంటే ఉంటారు కానీ, అన్ని సమయాల్లో కాదు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందించాం. టైటిల్ పాత్రను ప్రియాంక డే పోషించింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది'' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: షారుక్ షేక్, ఛాయాగ్రహణం: రామ్ కంద.
అనసూయ.. అసూయ... అనసూయ, సాయికుమార్, సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో జయశంకర్ తెరకెక్కించిన చిత్రం 'అరి'. మై నేమ్ ఈజ్ నో బడీ.. అనేది ఉపశీర్షిక. రామిరెడ్డి, శేషు మారంరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ప్రధాన పాత్రల ఫస్ట్‌లుక్‌లను ఇటీవల విడుదల చేశారు. ఇందులో జలసీ అనే అమ్మాయి పాత్రలో అనసూయ నటించగా.. ప్రైడ్‌గా సాయికుమార్ కనిపించనున్నారు. మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా ఆసక్తికరంగా చూపించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. శివశంకర వరప్రసాద్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
ప్రేమ కథలో విక్కీ.. 'అతరంగీ రే', 'రక్షాబంధన్' చిత్రాల తర్వాత ప్రముఖ దర్శకనిర్మాత ఆనంద్ ఎల్‌రాయ్ తన కొత్త చిత్రానికి ముస్తాబులు చేసే పనిలో ఉన్నారు. ఆయన మరోసారి ఓ కొత్త ప్రేమ కథను ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కథలో కీలకమైన కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నారు రాయ్. ఆ తర్వాత లోకేషన్లు ఎంపిక చేసి వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. విక్కీ కౌశల్ ప్రస్తుతం సామ్ మానెక్‌షా జీవిత కథలో నటిస్తున్నాడు. దీంతో పాటు 'ఇమ్మోర్టల్ అశ్వత్థామ' చిత్రం కూడా ఆయన చేతిలో ఉంది. వీటితో పాటు ఆయన నటించిన 'గోవిందా మేరా నామ్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
'మైఖేల్' టీజర్ ఆరోజే.. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జయకోడి తెరకెక్కిస్తున్నారు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ఈనెల 20న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రంలో సందీప్, దివ్యాంశకు ముద్దిస్తూ కనిపించారు. ''వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న చిత్రమిది. సందీప్ - దివ్యాంశల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో గౌతమ్ మేనన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు'' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సిఎస్, ఛాయాగ్రహణం: కిరణ్ కౌశిక్.
గాయకుడిగా మారిన శింబు.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన తమిళ కథానాయకుడు శింబు గాయకుడిగా మారాడు. సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం 'డబుల్ ఎక్స్‌ఎల్'. ఈ చిత్రంలో క్రికెటర్ శిఖర్ ధావన్‌తో పాటు తమిళనటుడు మహత్ రాఘవేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని 'తాలీ తాలీ..' అంటూ సాగే గీతాన్ని శింబు ఆలపించారు. ''గాయకుడిగా బాలీవుడ్‌లో నా తొలిపాట 'తాలీ తాలీ..'.ఇదంతా నా స్నేహితుడు మహత్ కోసమే అంటూ ట్వీట్ చేశారు శింబు.
కొత్త తరం టైమ్ ట్రావెల్.. యానియా భరద్వాజ్ ప్రధాన పాత్రలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఇంద్రాణి'. గరీమా కౌశల్, కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో మంచు విష్ణు ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఇలాంటి ఒక కొత్తతరం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చిత్ర బృందానికి నా అభినందనలు. నేపథ్య సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ అత్యుత్తమ నాణ్యతతో ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి'' అన్నారు. ''వినూత్నమైన టైమ్ ట్రావెల్ కథతో రూపొందిన సూపర్ హీరో చిత్రమిది. పోరాట ఘట్టాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తక్కువ సమయంలోనే అద్భుతమైన విజువల్స్ అందించేందుకు శ్రమిస్తున్న వీఎఫ్‌ఎక్స్ బృందానికి కృతజ్ఞతలు'' అన్నారు చిత్ర దర్శక నిర్మాత స్టీఫెన్.
మత్స్యకన్య ఎదురు చూపులు.. అందమైన మత్స్యకన్య ఏరియల్ ఓ మానవ యువరాజు ఎరిక్‌తో ప్రేమలో పడుతుంది. తను మానవ కన్యగా మారడానికి, యువరాజు ప్రేమను గెలుచుకోవడానికి సముద్రపు మంత్రగత్తె ఉర్సలాతో ఓ ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? మత్స్యకన్య ప్రేమ పోరాటం ఎలా ముగిసిందో తెరపైనే చూడాలి. ఇలాంటి ఓ కథతో తెరకెక్కుతున్న డిస్నీ చిత్రం 'ది లిటిల్ మెర్మైడ్'. ఇదే పేరుతో గతంలో తెరకెక్కిన యానిమేషన్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. హల్లె బెయిలీ మత్స్య కన్యగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను డిస్నీ సంస్థ విడుదల చేసింది. సముద్రగర్భంలో ఓ రాయిపై కూర్చొని ఎవరికోసమో ఆత్రంగా ఎదురుచూస్తున్న మత్స్యకన్య ఇందులో కనిపిస్తోంది. ఈ పాత్ర పోషించడం గురించి బెయిలీ ట్విటర్‌లో స్పందిస్తూ ''మత్స్యకన్య అనేది నా కలల పాత్ర. అందులో నేను నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. వచ్చే ఏడాది మే 26న నాతో పాటు సముద్రంలోకి రండి''అని ట్వీట్ చేసింది. రాబ్ మార్షల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'ది లిటిల్ మెర్మైడ్' యానిమేషన్ చిత్రానికి అప్పట్లో రెండు ఆస్కార్ పురస్కారాలు లభించాయి.
ఇదీ చూడండి: నయన్, విఘ్నేశ్‌ను విచారణకు పిలుస్తాం : తమిళనాడు ఆరోగ్య మంత్రి