మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్ రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. పొలిటికల్ డ్రామాగా సిద్ధమైన ఈ సినిమా తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పాజిటివ్ టాక్‌ను చేసుకుంది. బాక్సాఫీస్ ముందు బాగానే వసూళ్లను అందుకుంటోంది. అయితే తాజాగా ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు చిరంజీవి.
"విజయవంతమైన చిత్రాన్ని రీమేక్ చేయడం ఛాలెంజ్‌తో కూడుకున్నది. ఎందుకంటే ఒరిజినల్ స్టోరీని అప్పటికే ప్రేక్షకులు చూసి ఉంటారు. దానికి ఏమాత్రం తగ్గకుండా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కథను నడిపించాలి. గతంలోనూ నేను రీమేక్స్ చేశా. అయితే, రామ్‌చరణ్ చెప్పడం వల్లే ఈ సారి 'గాడ్‌ఫాదర్'లో నటించా. ఈ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇందులో నా పాత్రకు డ్యాన్స్‌లు, కామెడీ డైలాగ్‌లు ఉండవు. ఇక, నా వరకూ గొప్ప విమర్శకురాలు నా భార్య సురేఖ. ఏదైనా నచ్చకపోతే వెంటనే చెప్పేస్తుంది. ఆమె అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటా''
"ప్రస్తుత కాలంలో దక్షిణాది చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయన్నది ఎంత వాస్తవమో.. ప్రతి దక్షిణాది చిత్రం విజయం సాధించలేకపోతుందనేదీ అంతే వాస్తవం. అదేవిధంగా బాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతి చిత్రమూ విఫలం కావడం లేదు. సినిమా ఏం ప్రాంతానిదనేది కాదు.. కంటెంట్ మాత్రమే ముఖ్యం. అదే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఇకపై మనం ప్రాంతీయ చిత్రం అనే ట్యాగ్స్ వదిలి ముందుకు సాగాలి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని కాకుండా ఇండియన్ సినిమాగా అభివర్ణించాలి'' అని చిరు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నయనతార సరోగసీ వివాదం.. స్పందించిన విఘ్నేశ్!