సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోల సినిమాలు చాలా సార్లు పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి ఎన్టీఆర్ ఏయన్నార్ నుంచి ఇప్పటి చిరంజీవి బాలయ్య వరకు అందరి సినిమాలు ఎప్పుడో ఒక్కసారైనా క్లాష్ అయ్యాయి. ఇటీవలే 2023 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద కూడా అదే జరిగింది. 'వాల్తేరు వీరయ్య'గా మెగాస్టార్ వస్తే.. వీరసింహారెడ్డిగా బాలయ్య వచ్చారు. జోరుగా పోటీ పడ్డ ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే 'వీరసింహారెడ్డి' కన్నా 'వాల్తేరు వీరయ్య'కే ఎక్కవ కలెక్షన్స్ వచ్చాయి. అయితే మరో సారి ఈ ఇద్దరు తారలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ తన 108వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. 'ఎఫ్3' దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు బాలయ్య సైన్ చేశారు. మరో వైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న 'భోళా శంకర్' సినిమాలో చిరు నటిస్తున్నారు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయని సమాచారం.
ఇప్పటికే భోళా శంకర్, ఎన్బీకే 108ను మే 12న ఒకేరోజు విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు గతంలో పలు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే తాజాగా వచ్చిన టాక్ ప్రకారం ఈ రెండు సినిమాలు జులైలో విడుదలకు సిద్ధమవ్వనున్నాయట. మరి ఈ రెండింటిలో ఏది నిజమన్నది చిత్ర యూనిటే డిసైడ్ చేయాలంటున్నారు అభిమానులు. వారి నుంచి అఫిషియల్ అప్డేట్ వస్తే కాని ఈ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
కాగా చిరంజీవి.. 'భోళా శంకర్' మూవీ తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్. ఇందులో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను అనిల్ సుంకర, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మరో వైపు ఫాదర్ అండ్ డాటర్ రూపొందుతున్న ఎన్బీకే 108వ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుంది. ఈ మూవీకి సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.