Venkatesh Maha On KGF : పాన్ ఇండియా స్టార్ యశ్ నటించిన చిత్రం కేజీఎఫ్. రెండు భాగాలుగా రిలీజైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రూ.1250కోట్లు వసూళ్లు రాబట్టింది. అయితే తాజగా ఈ చిత్రంపై పరోక్షంగా సెటైరికల్ కామెంట్స్ చేశారు 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మహా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కేజీఎఫ్ పేరు చెప్పకుండా కథ గురించి చెప్తూ పరోక్షంగా విమర్శించారు. ఆ సినిమాలో హీరో తల్లి పాత్రను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని బంగారం మొత్తం కావాలనే తల్లులు ఉంటారా, ఉంటే నేను కలవాలని అనుకుంటున్నా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"బాగా చదివే వాళ్లకే ఇంకా చదవమని చెబుతుంటాం. నేనూ దీన్ని అంగీకరిస్తా. కానీ, ఇక్కడ చదివిన వాళ్లకంటే చదవని వాళ్లకే ఎక్కువ మార్కులు (కలెక్షన్స్) వేస్తున్నారు. వాళ్లను చూస్తుంటే మనకూ మార్కులే కదా ముఖ్యం. మనం కూడా అలాంటి సినిమాలే చేద్దామా అనిపిస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై పిచ్చి చిత్రాలు చూసి గొప్పగా మాట్లాడే యువత మొత్తానికి నా ప్రశ్న ఒక్కటే. మీ అభిప్రాయాలు, ఆలోచనా దృక్పథాన్ని మెరుగుపరచడం కోసం మేమింత కష్టపడుతున్నాం. గొప్ప సినిమా చేశారని చప్పట్లు కొట్టడం కాకుండా మంచి వసూళ్లు వచ్చేలా మీరూ చేయాలిగా..? అభ్యుదయ భావాలను పక్కన పెట్టి మేము సైతం పెన్ను వదిలి కత్తి పట్టుకుంటే ఇంకా గొప్పగా సినిమాలు చేస్తాం. ఆ శక్తి మాకుంది. కానీ మేము అలా చేయడం లేదు. అందుకే ప్రశ్నించే వాడికి మేము లోకువ అయిపోతున్నాం"
--వెంకటేశ్ మహా, దర్శకుడు
బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు, లేదా రూ.2000 కోట్ల వసూళ్లు చేస్తున్న సినిమాలన్నీ తన దృష్టిలో పాప్‌కార్న్ చిత్రాలని అభిప్రాయపడ్డారు. వీటిని సీన్ మధ్యలో మిస్ అయినా ఫర్వాలేదని చెప్పారు. వీటిని ఓటీటీలోనైనా చూడొచ్చని కానీ.. తాము తీసేవి కచ్చితమైన థియేటర్ చిత్రాలని తెలిపారు. తనలాంటి ఎంతోమంది దర్శకులు.. యువత కోసం మంచి చిత్రాలు తెరకెక్కించినప్పటికీ వాటికి సరైన వసూళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సారీ చెప్పిన నందిని రెడ్డి
అయితే, వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలపై యశ్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టిన ఈ సినిమా గురించి ఇలా మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ కౌంటర్ వేస్తున్నారు. మరోవైపు ఈ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఆయన మాటలకు నవ్విన డైరెక్టర్ నందిని రెడ్డి ఈ వివాదంపై స్పందించారు. తమ వ్యాఖ్యలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించండంటూ కోరారు.
ఇవీ చదవండి : నాలుగు పదాలతో ట్వీట్.. నెట్టింట ఫుల్ ట్రెండింగ్.. 'స్నేహ' క్రేజ్ మాములుగా లేదుగా!
'సీతను తీసుకెళ్లాలంటే సముద్రం కాదు.. ఈ రావణుడిని దాటాలి'.. రావణాసుర టీజర్ రిలీజ్