Bigg boss 7 Telugu Contestants Sobha Shetty : శోభా శెట్టి అంటే టక్కున గుర్తుపడతారో లేదో కానీ.. కార్తీకదీపం మోనిత అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. డాక్టర్‌బాబును దక్కించుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నిన అందమైన విలన్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కర్ణాటకకు చెందిన ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగింటి అమ్మాయిగా నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అయితే ఇంత పాపులారిటీ ఊరికే రాలేదట. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడిందని చెప్పుకొచ్చింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇచ్చింది. తన వ్యక్తిత్వం, ఇష్టాలు గురించి చెప్పుకొచ్చింది. "సీరియల్లో నెగెటివ్ పాత్ర పోషించాను.. కానీ, బయట చాలా పాజిటివ్‌గా ఉంటాను. అలాగే శారీకంగా ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. బయట ఏ పనీ చేయనన్న పేరు నాకు ఉంది. కానీ, బిగ్‌బాస్-7లో అన్నీ పనులు చేస్తాను. నన్ను బుల్లితెర రమ్యకృష్ణ అంటూ అందరూ పిలుస్తారు. దాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకాస్త మంచి పాత్రలు పోషిస్తాను." అని చెప్పింది.
ఇంకా తాను పడ్డ కష్టాలను కూడా తెలిపింది శోభా శెట్టి. "ఇంటి నుంచి స్కూలుకు వెళ్లాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. నా చెప్పులు తెగిపోతే కుట్టించుకోవడానికి కూడా డబ్బుల్లేక సేఫ్టీ పిన్ సాయంతో అలానే వినియోగించేదాన్ని. కొన్నిసార్లయితే కాళ్లకు చెప్పులు లేకుండానే స్కూలుకు నడిచి వెళ్లాను. యాక్టింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. కన్నడలో అంజనీపుత్ర అనే సినిమాలో చిన్న పాత్ర పోషించాను" అని పేర్కొంది. ఇకపోతే తెలుగు సీరియల్ కార్తీక దీపంలోని మోనిత పాత్రతో లక్షలాది మంది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మరి బిగ్‌బాస్ షోతో ఇంకెంతమంది అభిమానులను సంపాదించుకుంటుందో చూడాలి..
ఇకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ నేడు(సెప్టెంబర్ 3) గ్రాండ్‌గా ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి గెస్ట్లుగా హాజరై కాసేపు సందడి చేశారు. ఇంకా ఈ సీజన్లో ప్రియాంక జైన్, శివాజీ, దామిని భట్ల, ప్రిన్స్ యవార్, శుభశ్రీ, షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, యూట్యూబర్ టేస్టీ తేజ, డాక్టర్ గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ సహా పలువురు కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు.