Baby Movie Review: చిత్రం: బేబీ; నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, సాత్విక్ ఆనంద్, నాగబాబు, బబ్లూ, కుసుమ,లిరిష. సంగీతం: విజయ్ బుల్గానిన్; సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి; రచన, దర్శకత్వం: సాయి రాజేష్ నీలం; నిర్మాత: ఎస్.కె.ఎన్; విడుదల తేదీ: 14-07-2023
ఇటీవలి కాలంలో రిలీజ్‌కు ముందే పాటలు, ప్రమోషన్లతో అందరి దృష్టినీ ఆకర్షించింది 'బేబీ' మూవీ. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. 'కలర్ ఫొటో' లాంటి సినిమాలకు కథ అందించిన సాయి రాజేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించడం.. 'టాక్సీవాలా' హిట్ తర్వాత ఎస్‌కేఎన్ సోలోగా నిర్మించిన సినిమా కావడం వల్ల ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్లు లాంటివి యూత్‌కు మెచ్చేలా రూపొందిచడం వల్ల దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని ఈ 'బేబీ' అందుకుందా? ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కారా? సాయి రాజేష్ దర్శకుడిగా సత్తా చాటారా? అనే విషయాలు మీ కోసం..
కథేంటంటే: వైషు అలియాస్ వైష్ణవి (వైష్ణవి చైతన్య) బస్తీలో పెరిగిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను ఈమె ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమను అతను కూడా ఓకే చెప్తాడు. స్కూల్ డేస్ నుంచి మొదలైన వీరి ప్రేమ ఓ రేంజ్లో సాగుతుంది. అయితే టెన్త్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆనంద్ దేవరకొండ ఆటో డ్రైవర్‌గా స్థిరపడతాడు. ఇక వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ కొత్త పరిచయాల వల్ల ఆమె ఆలోచనా విధానంలో మార్పులు మొదలవుతాయి.
ఈ క్రమంలోనే తన క్లాస్‌మెట్ విరాజ్(విరాజ్ అశ్విన్)కు వైషు దగ్గరవుతుంది. స్నేహం పేరుతో మొదలైన ఆ బంధం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత అడ్డదారులు తొక్కుతుంది. దీంతో అనుకోని పరిస్థితుల వల్ల విరాజ్‌కు వైష్ణవి శారీరకంగా దగ్గరవ్వాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? వీరిద్దరి వ్యవహారం ఆనంద్‌కు తెలిసిందా? నిజం తెలిశాక తను ఎలా స్పందించాడు? అలాగే విరాజ్‌కు వైష్ణవి - ఆనంద్‌ల ప్రేమకథ తెలిసిందా? అసలు ఆనంద్ - విరాజ్‌లలో వైష్ణవి ఎవర్ని ప్రేమించింది? అన్నదే మిగతా కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎలా సాగిందంటే: 'మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది' బేబీ ట్రైలర్ మొదట్లో రాసిన కొటేషన్ ఇది. ఈ మాటకు తగ్గట్లుగానే స్టోరీ కూడా సాగుతుంది. తెలిసీ తెలియని వయసులో ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య పుట్టిన ప్రేమకథ.. వారు ఎదిగే క్రమంలో ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ ప్రేమ ఏ కంచికి చేరింది? అన్నదే అసలు కథ. ఇలాంటి చిన్ననాటి తొలి ప్రేమకథలు చాలా మంది జీవితాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కాలంతో పరిణతి చెందుతూ కొన్ని మాత్రమే పెళ్లి పీటలు దాకా ఎక్కుతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం మేర విషాద ప్రేమకథలే ఉంటాయి. అలాంటి ఓ సున్నితమైన ప్రేమకథే ఈ 'బేబీ' ఇక దర్శకుడు సాయి రాజేష్ ఈ కథను చక్కగా తెరకెక్కించారు.
ముఖ్యంగా ఇప్పటి యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. సినిమాలో కనిపించే చాలా సన్నివేశాలు ఈ కాలం యువతీ యువకుల మధ్య ఉన్న ప్రేమకు.. వారి ఆలోచనా విధానాలకు అద్దం పట్టేలాగే ఉంటాయి. ఓ భగ్న ప్రేమికుడిగా ఆనంద్‌ను పరిచయం చేసిన తీరు.. అతని కోణం నుంచి అసలు కథను ఆరంభించిన విధానం చాలా బాగుంటుంది.
ఆ తర్వాత నుంచి తొలి ఇరవై నిమిషాల పాటు వైష్ణవి - ఆనంద్‌ల స్కూల్ డేస్ ప్రేమకథే సాగుతుంది. సహజత్వం నింపుకొని మనసులకు హత్తుకునేలా సాగినా ఆ స్కూల్ స్టోరీని కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. పెద్దగా మాటలు లేకునప్పటికీ ఎక్స్ప్రెషన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వారి ప్రేమను హైలైట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక ఆనంద్ టెన్త్ ఫెయిలై ఆటో డ్రైవర్‌గా మారడం.. వైష్ణవి ఇంటర్ పూర్తి చేసి పై చదువులకు కాలేజ్‌లో చేరడంతో వీరి ప్రేమకథ ఓ మలుపుకు తిరుగుతుంది.
అయితే వైషూ కాలేజీలో చేరినప్పటి నుంచి ఏమవుతుందోనని ఆనంద్ కంగారు పడటం.. ఆమెపై అనుమానం పెంచుకోవడం.. కాలేజీలో ఫ్రెండ్స్‌ను చూసి వైషూ తన లైఫ్ స్టైల్ మార్చుకోవడం.. అది చూసి ఆనంద్ మరింత ఆందోళన పడటం.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలు.. ఆయా సన్నివేశాలన్నీ ఎంతో సహజంగా ఆసక్తిరేకెత్తిస్తూ సాగుతాయి.
ఇక ఎప్పుడైతే విరాజ్.. వైష్ణవి జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడో... అక్కడి నుంచి ఆనంద్ - వైషూల లవ్ స్టోరీలో మార్పులు చోటు చేసుకుంటుంది. సాఫీగా సాగుతున్న కథ కాస్త రసవత్తరంగా మారుతుంది. విరామానికి ముందు వైష్ణవితో ఆనంద్ గొడవ పడటం.. అనంతరం బాధతో వైషూ పబ్‌లో తప్పతాగి ఆనంద్‌కు ఫోన్ చేసి క్లాస్ పీకడం.. ఈ రెండు ఎపిసోడ్లకు థియేటర్లలో క్లాప్స్ పడతాయి.
ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒక్కసారిగా కథలో హీట్ పెంచడమే కాక సెకెండ్ హాఫ్ మరింత ఆసక్తిరేకెత్తించేలా చేస్తుంది. అయితే ఈ ఆసక్తిని ఇలాగే కొనసాగించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఓవైపు ఆనంద్‌కు నిజాన్ని తెలియకుండా దాచి పెడుతూ.. మరోవైపు విరాజ్‌తో బంధాన్ని కొనసాగిస్తూ వైష్ణవి నడిపే ట్రైయాంగిల్ ప్రేమ కచ ప్రేమకథ కాస్త లాగ్ అయినట్లు అనిపిస్తుంది. ఇక విరాజ్ కుట్ర పూరిత మనస్తత్వం బయట పడ్డాక అతని నుంచి బయట పడేందుకు వైష్ణవి పడే మానసిక సంఘర్షణ ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. అయితే ఆ ఎపిసోడ్ మరీ నత్తనడకన సాగినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఏమాత్రం సంతృప్తికరంగా అనిపించదు. ప్రేమిస్తే తరహా సినిమాల్ని గుర్తుకు వస్తాయి.
Baby Movie Cast : ఎవరెలా చేశారంటే: ఈ సినిమాలో హీరో పాత్రలో ఆనంద్ దేవరకొండ చాలా కొత్తగా కనిపించారు. అయితే స్కూల్ డేస్ పాత్ర తనకంతగా నప్పలేదనిపించింది. ఆటోడ్రైవర్‌గా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. భావోద్వేగభరిత సన్నివేశాలు బాగా చేసినప్పటికీ.. పతాక సన్నివేశాల్లో నటన కాస్త తేలిపోయినట్లనిపించింది. కాకపోతే వైష్ణవికి ఆయనకూ మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. హీరోయిన్ వైష్ణవికి మంచి బ్రేక్ ఇచ్చే మూవీ ఇది. ఇందులో ఆమె బస్తీ అమ్మాయిగా.. గ్లామర్ గర్ల్‌గా లుక్స్‌లోనే కాదు నటనలోనూ చక్కటి వేరియేషన్స్ చూపించింది. ఆమె పాత్రే సినిమాకి ప్రధాన ఆకర్షణ. బోల్డ్ సన్నివేశాల్లో ఆమె అందాలు ఒలికించింది. భావోద్వేగభరిత సన్నివేశాల్లో చక్కటి నటన కనబరిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రతినాయక ఛాయలున్న పాత్రలో విరాజ్ నటన ఆకట్టుకుంటుంది. నాగబాబు, హర్ష తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. సాయి రాజేష్ ఎంచుకున్న కథ.. రాసుకున్న సంభాషణలు.. సినిమాని సహజంగా తెరపై ఆవిష్కరించిన తీరు యువతరాన్ని మెప్పిస్తాయి. అయితే కథ, కథనాలను ఎక్కువ స్ట్రెచ్ చేశారేమో అనిపిస్తుంది. సినిమాలో ఏ పాత్రకూ అర్థవంతమైన ముగింపు ఇవ్వలేదు. దీని ప్రభావం క్లైమాక్స్‌పై పడింది. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం, పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బాల్‌రెడ్డి విజువల్స్ ఎంతో సహజంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
- బలాలు
- + కథా నేపథ్యం
- + యువతరం మెచ్చే అంశాలు
- + పాటలు, నేపథ్య సంగీతం
- బలహీనతలు
- - నెమ్మదిగా సాగే కథనం
- - ముగింపు
చివరిగా: టీనేజ్ కుర్రాళ్ల గుండెల్ని గట్టిగా కొట్టే ‘బేబీ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!