తమన్నా అనగానే ఆమె అందమైన రూపమే గుర్తొస్తుంది. అందంతోనూ, డ్యాన్స్ ప్రతిభతోనూ తొలి అడుగుల్లోనే కమర్షియల్ కథానాయికగా పేరు సంపాదించుకుంది. ఇప్పుడు మాత్రం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. భిన్నమైన పాత్రల్లోనూ ఒదిగిపోయే ప్రయత్నం చేస్తోంది. ఇటు దక్షిణాదిలోనూ.. అటు హిందీ చిత్రసీమలోనూ సీనియర్ కథానాయికగా కొనసాగుతున్న ఆమె ఇటీవల 'బబ్లీ బౌన్సర్'లో నటించింది. ఆ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ నెల 23న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తమన్నా పంచుకున్న విషయాలివీ..
"కథానాయికగా నా కెరీర్ ఇక్కడి నుంచే మొదలైంది. తెలుగు సినిమాకి ప్రాంతీయంగానే కాదు, హిందీలోనే అని కాదు, అంతీర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోంది. అందుకు ప్రధాన కారణం.. మన దర్శకులు భారతీయ కథలు, మన మూలాల్లోని కథలు చెబుతుండడమే. అది నచ్చితే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎక్కడినుంచైనా చూస్తారు. ఈ దశలో నటులుగా మేం కూడా ఒక భాషకి, ఒక రకమైన పాత్రలకి పరిమితం కాకూడదు. స్వతహాగా నాకు కమర్షియల్ సినిమాలంటే నాకు ఇష్టమే. నేను ఆ స్కూల్ నుంచి వచ్చిన నటినే. ఇప్పుడు కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలు చేస్తున్నా. ఈ దశలో మధుర్ భండార్కర్‌తో కలిసి 'బబ్లీ బౌన్సర్' చేయడం నా కెరీర్‌లో ఓ గొప్ప పరిణామం. ఈ సినిమా కోసం హరియాణా యాసపై పట్టు సాధించా. బుల్లెట్ నడపడం నేర్చుకున్నా. కొంచెం బరువు కూడా పెరిగా"
--తమన్నా, నటి
మెల్లమెల్లగా అదీ సాధ్యమే: "సినిమా అనగానే హీరో ఎవరు? అని అడుగుతుంటారు. ఒక సినిమాలో హీరో అంటే అబ్బాయేనా? ఒక అమ్మాయి హీరోగా ఉండటం సాధ్యం కాదా? ఇదే విషయం అంటే.. 'నిజమే కదా, అలా ఎందుకు ఉండకూడదు?' అని ఒప్పుకునేవాళ్లు చాలామందే. కథానాయిక ప్రాధాన్యమున్న సినిమా అని మేమే చెప్పడం మొదలుపెట్టాం, దాన్ని మేమే సరిచేయాలి. ఏ సినిమానైనా మనం హీరో ఓరియెంటెడ్ అంటామా? లేదు కదా! ప్రధాన పాత్రధారి అక్కడ అబ్బాయి ఉంటే, ఇక్కడ అమ్మాయి ఉంటుందంతే. శారీరకంగా బలంగా ఉండేది అబ్బాయిలొక్కటే అనుకుంటారు చాలా మంది. అమ్మాయిలు కూడా ఉంటారు. మన మహిళా అథ్లెట్సే అందుకు ఉదాహరణ. చాలా సినిమాల్లో కథానాయికల పాత్రలతో అమ్మాయిల్లో భావోద్వేగాల బలాన్ని చూశాం. కానీ అమ్మాయిల శారీరక బలం గురించి ఎక్కువగా ఏ సినిమా మాట్లాడలేదు. 'బబ్లీ బౌన్సర్' తరహా సినిమాలతో మెల్లగా అదీ సాధ్యమవుతోంది".
పెళ్లి సమయం వస్తే నేనే చెబుతాను: "పాన్ ఇండియా అని ఈమధ్య అంటున్నారు కానీ.. మా కెరీర్‌కి స్ఫూర్తినిచ్చిన కథానయికలంతా పాన్ ఇండియా స్టార్లే. రేఖ, జయప్రద, శ్రీదేవి.. ఇలా ఎంతోమంది అన్ని భాషల్లోనూ సత్తా చాటారు. భిన్న భాషల్లో నటిగా ప్రయాణం చేస్తూ వ్యక్తిగా నేనెంతగా పరిణతి చెందానో, మా అమ్మానాన్నల ఆలోచనల్లోనూ అంతే పరిణతి పెరిగింది. నా కెరీర్‌ని గమనిస్తున్నవాళ్లు పెళ్లి అంటూ ఏ రోజు నాపై ఒత్తిడి తీసుకురాలేదు. ఆ సమయం వస్తే నేను ఆనందంగా ఇంట్లో చెబుతాను".
అమ్మాయి ఎలా ఉండాలో నిర్ణయించేదెవరు?: "మనవైన పాత ఆలోచనలతోనూ, మన సినిమాలతోనూ మనమే కొన్ని స్థిరమైన అభిప్రాయాల్ని ఏర్పరుచుకున్నాం. ఒక అమ్మాయంటే ఇలాంటి నడవడికతోనే ఉండాలని, ఎప్పుడూ లంగాఓణీలోనే కనిపిస్తుందని ఊహిస్తాం. మన సినిమాలు ఇప్పటిదాకా అమ్మాయిని అలా చూపించాయి. 'బబ్లీ బౌన్సర్'లో నా పాత్రని చూసి ఈమె పల్లెటూరి అమ్మాయిలా లేదేమిటి? అన్నవాళ్లు కూడా ఉన్నారు. అయినా ఒక అమ్మాయి ఎలా ఉండాలో ఎవరు నిర్ణయిస్తారు? అసలు బౌన్సర్ ప్రపంచం గురించే చాలా మందికి తెలియదు. ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి కానీ, ఓ కొత్త విషయాన్ని చెప్పడానికి ముందు నటులుగా మేం ముందుకు రావాలి. అప్పుడే ఆ పాత్రలతో ప్రేక్షకుల్ని నమ్మించగలం".
ఘర్షణ..: 'బబ్లీ బౌన్సర్' ప్రచార కార్యక్రమంలో మీడియా ప్రతినిధులకీ, బౌన్లర్లకీ మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఇద్దరు కెమెరామెన్లు స్వల్పంగా గాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి తమన్నాతోపాటు, దర్శకుడు మధుర్ బండార్కర్ హాజరయ్యారు. తమన్నా స్టూడియోలో తనకి కేటాయించిన గదికి వెళ్లిన అనంతరం బౌన్సర్లు, మీడియా ప్రతినిధుల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. అనంతరం బౌన్సర్లు క్షమాపణలు చెప్పడం వల్ల వివాదం ముగిసింది.
ఇవీ చదవండి: ఒక్క తెలుగు సినిమాతో స్టార్ హీరోయిన్గా.. ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా?