సూపర్‌హీరో చిత్రాలను అమితంగా ఇష్టపడే వారి మనసు దోచిన సినిమా 'యాంట్-మ్యాన్'. 2015లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత ఈ సిరీస్‌లో మార్వెల్ స్టూడియోస్ నుంచి 'యాంట్- మ్యాన్ అండ్ ది వాస్ప్' వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సిరీస్‌లో ముచ్చటగా మూడో చిత్రంగా 'యాంట్- మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా' రాబోతుంది. ఇది ఈ నెల 17న దేశవ్యాప్తంగా విడుదలవుతోంది.
మొదటి.. రెండో చిత్రాల్లో ఏమైంది?
పెటన్ రీడ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, స్టీఫెన్ బ్రౌస్సార్డ్ నిర్మించారు. యాంట్-మ్యాన్(2015), యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్(2018)కి సీక్వెల్‌గా అమెరికన్ సూపర్ హీరో పేరుతో మార్వెల్ కామిక్స్ పాత్రలు స్కాట్ లాంగ్, హాంక్ పైమ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. డారెన్ క్రాస్ వల్ల తన సొంత కంపెనీ నుంచి బలవంతంగా బయటికి వెళ్తాడు డా.హాంక్ పైమ్. అప్పుడు జైలు నుంచి విడుదలైన స్కాట్ లాంగ్ అనే దొంగ పైమ్ దగ్గర శిక్షణ తీసుకొని యాంట్-మ్యాన్ అవుతాడు. మానవాతీత శక్తిని కలిగి ఉండటానికి, చీమల సైన్యాన్ని నియంత్రించే సూట్‌ని ధరిస్తాడు. దీనిని చెడు కోసం ఉపయోగించకుండా కొత్త నైపుణ్యాల కోసం ఉపయోగిస్తాడు. హోప్ వాన్ డైన్, హాంక్ పైమ్‌లు కనిపెట్టిన యాంట్-మ్యాన్ సూట్‌ని స్కాట్లాంగ్ ఒక తండ్రిగా మరోసారి ధరించి కందిరీగతో కలిసి పోరాడతాడు. తరవాత పైమ్, అతని కుమార్తె క్వాంటం రాజ్యానికి వెళ్లడానికి ఒక సొరంగంను కనిపెడతారు.
ఇదీ తాజా కథ
'యాంట్- మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా' ద్వారా స్కాట్ లాంగ్ (యాంట్-మ్యాన్), హోప్ వాన్ డైన్ (వాస్ప్)లు మూడవ యాంట్- మ్యాన్‌లో వారి సాహసాలను కొనసాగించడానికి తిరిగి వచ్చారు. హోప్ తల్లిదండ్రులు, మిగిలిన కుటుంబంతో కలిసి క్వాంటం రాజ్యాన్ని అన్వేషించడమే కాదు అక్కడ వింత జీవులతో మాట్లాడతారు. దీని వల్ల వారు తమ శక్తులకు మించి సాహసించాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది. ఆ తర్వాత యాంట్ మ్యాన్ సాహసాలు ఏవిధంగా సాగాయనేది ఆసక్తికరం.
ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆస్వాదించా
సైన్స్ ఫిక్షన్, అడ్వంచరస్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలని పురస్కరించుకుని చిత్రంలో సూపర్ విలన్ కాంగ్ ది కాంకరర్ పాత్రని పోషించిన జొనాథన్ మేజర్స్ భారతీయ సినిమాల గురించి మాట్లాడారు. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాని చాలాసార్లు చూశానని, ఆద్యంతం ఆస్వాదించానని తెలిపారు.
మన దేశంలో నాలుగు భాషల్లో
పాల్ రడ్(స్కాట్ లాంగ్), ఇవాంజెలిన్ లిల్లీ( హోప్ వాన్ డైన్), హోప్ తల్లిదండ్రులు (జానెట్ వాన్ డైన్)మిచెల్ ఫైఫెర్, (హాంక్ పైమ్) మైఖేల్ డగ్లస్, (స్కాట్ కుమార్తె కాసీ లాంగ్)కాథరిన్ న్యూటన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. లాస్ ఏంజెలెస్‌లో ఈ సినిమాని ఈ నెల 6న ప్రదర్శించారు. అక్కడ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందిన ఈ చిత్రం 17న తెలుగు, హిందీ, తమిళ, ఆంగ్ల భాషల్లో ఈ ప్రేక్షకులను అలరించబోతుంది. అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల విషయంలో ఈ సినిమా దూకుడు మీద ఉందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">