కృష్ణ జింకల కేసు కారణంగా వరుస బెదిరింపులను ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. గత నెల 19న ఆయనకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతపై ఆయన మరింత దృష్టి సారించారు. ఈ క్రమంలో ఓ అత్యాధునిక హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ ఎస్‌యూవీని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అయిన ఈ నిస్సన్ అనే ఈ ఎస్‌యూవీ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే భారత్‌లో ఈ కారును నిస్సన్ కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. ఒకవేళ ఈ కారును ప్రైవేట్‌గా దిగుమతి చేసుకుంటే దాదాపు రూ. 2 కోట్ల మేర ధర ఉంటుందని అంచనా.
ఇటీవలే ముంబయిలోని జియో వరల్డ్‌లో జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చినప్పుడు సల్మాన్ ఈ కొత్త కారులోనే వచ్చారు. అంతకుముందు టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200లో తిరిగే సల్మాన్.. ఇప్పుడు ఈ కొత్త కారులోనే తిరుగుతున్నారు. పూర్తిగా బుల్లెట్ ఫ్రూఫ్ ఉన్న ఈ నిస్సాన్ కారు భద్రతా పరంగా చాలా ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం సల్మాన్ వద్ద టయోటా ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ఫ్రూఫ్ కారు కూడా ఉంది. అంతే కాకుండా పాటు లక్సస్ ఎల్ఎక్స్ 470, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, ఆడి ఏ8, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడీ ఆర్ఎస్7, మెర్సిడెస్ ఎఎంజీ జీఎల్ఈ 63 ఎస్ కార్లు ఉన్నాయి.
కాగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల కారణంగా ముంబయి పోలీసులు సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇద్దరు ఎస్సై స్థాయి అధికారులతో పాటు దాదాపు 10 మంది కానిస్టేబుళ్లను ఆయన ఇంటి వద్ద ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాంద్రా శివారులోని సల్మాన్ నివాసంతో పాటు ఆఫీస్ బయట భారీ ఎత్తున అభిమానులను గుమిగూడే అనుమతి లేదని అధికారులు వెల్లడించారు.
ఇదేం కొత్త కాదు..
గ్యాంగ్‌స్టర్ల నుంచి సల్మాన్‌కు బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2018లో కృష్ణజింకల కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ఆ వన్యప్రాణులను వేటాడం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. సినిమాల విషయానికి వస్తే.. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'తో సల్మాన్ ఏప్రిల్ 21 ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా తర్వాత దీపావళికి టైగర్ 3ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.