Allari naresh Allari movie: హాస్యానికి చిరునామాగా మారిపోయి, ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళ్లిన నటుడు అల్లరినరేష్. ప్రస్తుతం భిన్నమైన కథలు చేస్తూ కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన నటించిన తొలి సినిమా 'అల్లరి' నేటితో 20ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా కెరీర్, సహా తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ సంగతులివీ..
నరేష్ ఇంటి పేరు ఈదర నుంచి అల్లరిగా మారి ఇరవయ్యేళ్లయింది. 'అల్లరి'తో కథానాయకుడిగా పరిచయమైన ఆయన.. తర్వాత వెనుదిరిగి చూడలేదు. హాస్యానికి చిరునామాగా మారిపోయి, ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళ్లారు. కితకితలు పెట్టడమే కాదు... తన నటనలో మరో కోణం కూడా ఉందని 'గమ్యం', 'శంభో శివ శంభో', 'మహర్షి', 'నాంది' తదితర చిత్రాలతో నిరూపించారు. ఆయన తొలి చిత్రం 'అల్లరి' ప్రేక్షకుల ముందుకొచ్చి మంగళవారంతో 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా కెరీర్ గురించి పలు విషయాలు తెలిపారు. ఆ విశేషాలివీ..
ఎవ్వరికైనా తొలి సినిమా రోజులు బాగా గుర్తుంటాయి. నా సినిమాని మొదటిరోజు మొదటి ఆటని సంధ్య 70 ఎం.ఎం.లో చూస్తున్నా. ప్రేక్షకులు బాగానే వచ్చారు కానీ, లోపల కూర్చుని చూడటానికి కూడా ధైర్యం సరిపోలేదు. మనసులో పలు రకాల ఒత్తిడి. బయటికొచ్చి కూల్‌డ్రింక్ తాగుతూ జీవితంలో ఇంకో ఐదు సినిమాలు చేస్తానేమో అనుకున్నా. అలాంటిది 57 సినిమాలు చేయడం ఓ గొప్ప అనుభూతి. వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే ఇరవయ్యేళ్లా అనే ఆశ్చర్యం కలుగుతుంది.
ఒకరోజు రవిబాబు 'నేను దర్శకత్వం చేస్తే హీరోగా నటిస్తావా?' అని అడిగారు. నాకు ఆసక్తి ఉందని చెప్పా. సినిమా మొదలు పెట్టడానికి రెండు రోజల ముందే పిలిచి ఫొటోషూట్ చేశారు. 'మా నరేష్ సంగతి తర్వాత, ఇందులో అందరూ కొత్తవాళ్లే. నీ కెరీర్‌కి మేలవుతుందో లేదో చూసుకో' అని రవిబాబుకి మా నాన్న జాగ్రత్త చెప్పారు. కానీ ఆయన మాత్రం చాలా నమ్మకంగా నాతో ఆ సినిమాని చేశారు. పలు పరిమితుల మధ్య చేశాం. ఎన్ని రిహార్సల్స్ అయినా చేసుకో, కానీ రీల్ మాత్రం వృథా కాకూడదని చెప్పేవారు. ఆ సినిమాకి నేనెక్కువగా తీసుకున్న టేక్‌లు అంటే మూడే. 60 కేన్ల రీల్స్‌తోనే ఆ సినిమాని పూర్తి చేశాం. అలాంటి పరిస్థితుల మధ్య సినిమా చేయడం నాకెంతో అనుభవాన్నిచ్చింది.
కామెడీ గుర్తింపు అనేది అనుకోకుండా వచ్చింది. నేను, మా నాన్న కలిసి తొమ్మిది సినిమాలు చేశాం, అందులో కామెడీ కథలతో తెరకెక్కిన ఏడు చిత్రాలు విజయవంతమయ్యాయి. అప్పటిదాకా కూడా దర్శకనిర్మాతలకి కూడా నాతో ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో సందేహంగానే ఉండేవాళ్లు. కామెడీ బాగా చేస్తాడనే పేరు రావడంతో ఆ తరహా కథలతోనే వచ్చారు. మధ్యలో చేసిన సీరియస్ సినిమాలతో విజయాలు దక్కకపోయినా అవి నా కెరీర్‌కి మేలే చేశాయి. 'నేను' వల్ల 'గమ్యం', ఆ సినిమా వల్లే 'శంభో శివ శంభో', 'మహర్షి' కథలు నా దగ్గరికి వచ్చాయి. కె.విశ్వనాథ్, బాపు, వంశీ, కృష్ణవంశీ లాంటి అగ్ర దర్శకుల సినిమాల్లో నటించడం నా అదృష్టం. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది. మధ్యలో కొన్ని కథలు అనుకున్నా కుదరలేదు. కచ్చితంగా మేం కలిసి సినిమా చేస్తాం.
ప్రేక్షకులు మారారు. అందుకు తగ్గట్టుగా మేం మారకపోతే తిరస్కారానికి గురవుతాం. 'నాంది' నాకు కొండంత బలాన్నిచ్చింది. వరుసగా కామెడీ కథల్లోనే నటించడంతో చేసిందే చేసినట్టు అనిపించింది. సీరియస్ కథని నాపైన చూస్తారని 'నాంది' దర్శకనిర్మాతలు నమ్మారు. అందుకే అంత పెద్ద విజయం. సినిమా ఏదైనా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే అలాంటివి ఎంపిక చేసుకుంటూ వెళుతున్నా. కెరీర్‌లో 72 గంటలు ఏకధాటిగా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2006లో ఆరు సినిమాలొచ్చాయి. 2008లో 8 చేశా.
నాన్న దూరమవడం ఓ నటుడిగా కంటే కూడా, కొడుకుగానే ఎక్కువగా మిస్ అవుతున్నా. ‘నాంది’ విడుదల తర్వాత మాత్రం నాన్న ఉండుంటే బాగుండేదనిపించింది. ఆయన రాసుకున్న కథాలోచనలు, సినిమా పేర్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. 'అలీబాబా అరడజను దొంగలు'కి సీక్వెల్‌గా 'అలీబాబా డజన్ దొంగలు' చేద్దామనుకున్నారు. కానీ అలాంటి కథల్ని, అంతమంది నటుల్ని మేనేజ్ చేస్తూ సినిమాలు తీసేవాళ్లు ఇప్పుడు ఎవరున్నారు? ప్రసుతం పరిస్థితులు సున్నితమయ్యాయి. కామెడీ కథ రాస్తే ఎవ్వరిమీద జోక్‌లు వేయకుండా, ద్వంద్వార్థాలు లేకుండా చూసుకోవాలి. అలా రాసేవాళ్లు ఇప్పుడూ ఉన్నారు కానీ, ఒకప్పుడు కామెడీ కోసమే రచయితలు ఉండేవారు. ఇప్పుడు కనిపించడం లేదు. కామెడీ సినిమాలు కష్టమనడం ఒప్పుకోను. 'ఎఫ్2' వంద కోట్లపైనే వసూలు చేసింది. ప్రస్తుతం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా చేస్తున్నా. గిరిజన గ్రామం నేపథ్యంలో సాగే కథ అది. దాంతోపాటు మూడు కథలు సిద్ధమవుతున్నాయి.
ఇదీ చూడండి: నాన్న బయోపిక్ నేను చేయను: మహేశ్‌బాబు