ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 'నాటు నాటు' పాటకు గోల్డ్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై ఆ పాట గాయకుల్లో ఒకరైన రాహుల్ సిప్లిగంజ్ ఆనందం వ్యక్తం చేశారు. 'నాటు నాటు' పాటకు థియేటర్లో తానూ పేపర్లు ఎగరేసి రచ్చ రచ్చ చేశానని గుర్తు చేసుకున్నారు. గల్లీ నుంచి వచ్చిన తన పేరు గోల్డెన్ గ్లోబ్ వేదికపై వినిపించడం.. జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవంగా రాహుల్ చెప్పారు. ఆర్ఆర్‌ఆర్ చిత్రం ఆస్కార్ బరిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు.
ఇక ఇటీవలే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ నాటు నాటు గురించి మాట్లాడుతూ.. "నాటునాటు పాట నేను, కాలభైరవ కలిసి పాడాం. పాడుతున్నప్పుడు కీరవాణి గారు చాలా ట్యూన్స్ చేస్తుంటారు. అలా ట్యూన్స్‌కి పాడుతున్నప్పుడు ఈ పాట లిరిక్స్‌ని విని ఇది ఆర్‌ఆర్‌ఆర్ పాట అని అర్థమైంది. ఆ పాట పాడుతున్నప్పుడు 'ఇది ఫైనల్ కాదు.. ట్రాక్ మాత్రమే' అని కీరవాణి గారు చెప్పారు. నేను పాడిన తర్వాత ఏడాదిన్నరకు ఆ పాట రిలీజ్ అయింది. నేను పాడిన పాటే ఫైనల్ అవుతుందని అప్పటి వరకు తెలీదు.. విచిత్రం ఏంటంటే తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ, హిందీలోనూ నేను పాడిన పాటే సినిమాలో ఉంచారు. తెలుగులో పాడిన తర్వాత వల్లీ మేడం(కీరవాణి సతీమణి) ఫోన్ చేసి ఒకసారి తమిళ్ వెర్షన్‌కు కూడా పాడమన్నారు. అలా మిగతా భాషల్లో కూడా ఓకే అయింది. కీరవాణి గారు నాకు ఈ పాట పాడే అవకాశం ఇవ్వడమే పెద్ద ప్రశంస." అని అన్నారు.
ఇదీ చూడండి:
గోల్డెన్ గ్లోబ్స్‌లో బెస్ట్ సాంగ్‌గా 'నాటు నాటు'.. ఆ పాట గురించి ఈ విషయాలు తెలుసా?