Alibhatt pregnancy: "నేను పార్సిల్ కాదు. మహిళను. పాతకాలపు ఆలోచనల నుంచి బయటకురండి" అంటూ మండిపడింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్. 'ఇంకా మనం పితృస్వామ్య సమాజంలోనే బతకాల్సి రావడం బాధాకరమ'ని పేర్కొంది.
అసలేం జరిగిందంటే.. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు సోమవారం సోషల్‌మీడియా వేదికగా ద్వారా తెలిపింది ఆలియా. ఆస్పత్రిలో స్కాన్ చేయించుకున్న ఓ అపురూప చిత్రాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రీకరణలో పాల్గొంటోంది. అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన నేపథ్యంలో తన కమిట్మెంట్స్కు బ్రేక్ ఇచ్చి ఆలియా విశ్రాంతి తీసుకుంటుందని, రణ్‌బీర్ యూకేకు వెళ్లి ఆమెను ముంబయికి తీసుకొచ్చేస్తాడని వార్తలు వచ్చాయి. జులై మధ్య నాటికి తన షూటింగ్స్‌ను పూర్తి చేసి.. బిడ్డను కనేవరకు రెస్ట్ తీసుకుంటుందని కథనాలు వచ్చాయి.
అయితే తాజాగా స్పందించిన ఆలియా.. ఆ కథనాలపై మండిపడింది. "ఏ పనీ ఆగిపోదు. ఎవరిని ఎవరూ తీసుకురావాల్సిన అవసరం లేదు. నాకు ఎలాంటి విశ్రాంతి అవసరం లేదు. డాక్టర్ సలహాతో నేను ముందుకు సాగుతానని మీరు తెలుసుకుంటే మంచిది. ఇది 2022. దయచేసి పాతకాలపు ఆలోచనలను మానుకోవడం మంచిది" అని చెప్పింది.
కాగా, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌ని ఆలియా ప్రేమ వివాహం చేసుకుంది. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఏప్రిల్ 14న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఆలియా చెప్పిన శుభవార్తతో.. భట్, కపూర్ కుటుంబాల్లో ఆనందం నెలకొంది. సెలబ్రిటీలు, నెటిజన్లు.. ఆలియాకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.
'ఆర్‌ఆర్‌ఆర్'తో.. బీటౌన్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన ఆలియా 'ఆర్‌ఆర్‌ఆర్'తో తెలుగువారికి చేరువైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈసినిమాలో ఆమె రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె, తన భర్తతో కలిసి 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈసినిమా మొదటి భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: రణ్‌బీర్ ప్రేమలో పడిపోయిన ముద్దుగుమ్మలు వీరే!