వాణిశ్రీ... ఒకప్పుడు తెలుగు సినిమానేలిన కళాభినేత్రి. మొన్నటిదాకా అత్తపాత్రల్లోనూ సత్తా చాటిన సహజ నటి. ఆమె తన నిజ జీవితంలో చేసిన న్యాయపోరాటాన్ని ఓ సినిమాగానూ తీయాలనుకుంటున్నారట కోలీవుడ్ నిర్మాతలు కొందరు. అంతగా ఏం జరిగిందంటే... వాణిశ్రీ 1970ల్లో చెన్నైలోని చూలైమేడు అన్న ప్రాంతంలో సుమారు 9000 చదరపు అడుగుల స్థలాన్ని కొన్నారు.
ఆమె భర్త డాక్టర్ కరుణాకరన్ అక్కడో కారు బ్యాటరీ తయారీ కంపెనీ నడిపి, నష్టాలు రావడంతో మూసేశారు. ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని ఓ వ్యక్తికి అద్దెకిచ్చారు. 1990ల తర్వాత దాని విలువ కోట్లకి ఎగబాకింది. దాంతో ఆ స్థలంపైన భూకబ్జా మాఫియా కన్నుపడి వాళ్ళ హస్తం... చాపకింద నీరులా చొచ్చుకొచ్చింది.
నకిలీవని తెలిసినా...
వాణిశ్రీ కుటుంబానికి తెలియకుండానే అద్దెకు తీసుకున్న వ్యక్తిని బెదిరించి స్థలాన్ని లాక్కున్నారు కబ్జాదారులు. వాణిశ్రీ భర్త పేరుతో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ)ని తయారుచేశారు. దాని పరిధిలోకి ఈ స్థలాన్ని తెచ్చి అమ్మేశారు. 2010లో ఈ విషయం తెలిసి వాణిశ్రీ రిజిస్ట్రేషన్ అధికారుల్ని ఆశ్రయించారు. వాళ్లు 'ఔనమ్మా... వాళ్ళవన్నీ నకిలీపత్రాలే. కానీ వాటిని రద్దుచేసీ, మీ ఆస్తిని మీకు అప్పగించే అధికారం మాకు లేదు. ఆ పని కోర్టే చేయాలి!' అని చెప్పారు.
నిజానికి, బ్రిటిష్‌వాళ్ళ కాలంనాటి 'ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908' అదే చెబుతోంది. ఎవరైనా ఓ స్థలాన్ని కబ్జా చేసినా... ఆ వ్యవహారం మొత్తం నకిలీ పత్రాలతోనే సాగిందని తెలిసినా... దాన్ని బాధితులకి ఇవ్వాలంటే కోర్టు ఆదేశాలుండాలి. కాబట్టి, బాధితులు చేయగలిగిందల్లా- సంబంధిత వ్యక్తులపైన క్రిమినల్ కేసు పెట్టడం.
వాళ్లు నకిలీపత్రాలు సృష్టించి తమ స్థలాన్ని అమ్మేశారనీ, దీనిపైన క్రిమినల్ కోర్టులో కేసు నడుస్తోందనీ, కాబట్టి ఆ భూమిని తమకే అప్పగించాలని కోరుతూ సివిల్ కోర్టుని ఆశ్రయించడం. దాని ప్రకారమే వాణిశ్రీ కుటుంబం మొదట అక్రమార్కులపైన క్రిమినల్ కేసు పెడితే... పోలీసులు నలుగుర్ని అరెస్టు చేశారు. కానీ జైలుకెళ్ళినంత వేగంగానే వాళ్ళు బెయిలుపైన బయటకొచ్చారు. వాణిశ్రీ కుటుంబం వాళ్ళు కబ్జా చేసిన ఆస్తి తమకు అప్పగించాలంటూ సివిల్ కోర్టులో కేసు వేస్తే... న్యాయస్థానానికి హాజరుకావడానికే వాయిదాల మీద వాయిదాలు తీసుకోవడం మొదలుపెట్టారు!
ఓ మరణం...
వాణిశ్రీ వాళ్ళబ్బాయి అభినయ వెంకట కార్తిక్ ఈ కేసు వ్యవహారాల్ని చూస్తూ రావడంతో... అతణ్ని నేరుగా బెదిరించడం మొదలుపెట్టారు కబ్జాదారులు. ఇరవైకోట్ల విలువైన స్థలాన్ని... అతి చవగ్గా అమ్మాలంటూ పేచీ పెట్టారు. 'ఆ ఒత్తిడి భరించలేక... మానసిక వేదనని తట్టుకోలేక... 36 ఏళ్ళు కూడా నిండని మావాడు చనిపోయాడు' అంటూ ఇప్పటికీ కన్నీరుమున్నీరవుతారు వాణిశ్రీ. కొడుకు మరణం ఆమెని బాగా కుంగదీసింది.'ఆపైన కేసు నడిపేందుకు మా దగ్గర చిల్లిగవ్వలేదు!' అంటారామె. కానీ భూకబ్జాదారులు ఇదే అదనుగా ఊహించని ఎత్తువేశారు.
ఇదివరకు అరెస్టై విడుదలైన వాళ్ళలో తమీమ్ అన్సారీ అన్నవాడు- కోర్టులో పాత కేసు పెండింగ్‌లో ఉండగానే ఈ స్థలంపైన మరోసారి నకిలీ పత్రాల్ని సృష్టించాడు. ఓ కొత్త వ్యక్తికి నాలుగుకోట్ల రూపాయలకి అమ్మేశాడు. తమీమ్‌ని పోలీసులు మళ్ళీ అరెస్టు చేసినా... షరా మామూలే. కోర్టులో ఎప్పట్లాగా వాయిదాలే. అప్పటికి 75 ఏళ్ళ వయసులో ఉన్న వాణిశ్రీ, ఆమె భర్తా... ఎంతకని పోరాడతారు?! అప్పుడే... వాళ్ళకి సాయం చేయడానికి నడుంబిగించింది తమిళనాడు ప్రభుత్వం!
ఏం చేసిందంటే...
భూకబ్జా వ్యవహారాల్లో సివిల్ కోర్టుకి వెళితేకానీ న్యాయం జరగదనే పరిస్థితిని కల్పిస్తున్న ‘ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908’ని సవరించాలనుకుంది. దేశంలో మరే రాష్ట్రమూ చేయని విధంగా- భూకబ్జా వ్యవహారాలపైన బాధితులకి న్యాయం చేసే అధికారాన్ని సంబంధిత రెవెన్యూ అధికారికే కట్టబెడుతూ ‘సెక్షన్ 22బి’ని చేర్చింది. 77ఏ అన్న మరో సెక్షన్ ద్వారా ఈ వ్యవహారాల్లో కోర్టుదాకా వెళ్ళకుండా ఇరుతరఫువాళ్ళనీ విచారించి తీర్పునిచ్చే అధికారాన్ని జిల్లా కలెక్టర్‌కి అప్పగించింది. ఈ మేరకు శాసనసభలో ముసాయిదా ప్రవేశపెట్టి... రాష్ట్రపతికి పంపింది.
ఆయన ఆమోదం వచ్చిందే తడవుగా గత సెప్టెంబర్ నుంచి అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా ఐదుగురు బాధితులకి వాళ్ళ భూమిహక్కు పత్రాల్ని అప్పగించింది. వాళ్లలో నటి వాణిశ్రీ కూడా ఒకరు! 'చనిపోయిన నా కొడుకే... మళ్ళీ వచ్చి ఈ స్థలాన్ని నాకు అప్పగించినట్టుంది!' అని కన్నీళ్ళు పెట్టుకున్నారామె... ఆ పత్రాల్ని అందుకుంటూ! ఈ చట్టాన్ని అందరూ 'వాణిశ్రీ చట్టం' అని పిలుస్తుండడం కొసమెరుపు!
ఇదీ చదవండి: Prabhas: ఆ సినిమా స్ఫూర్తితోనే హీరోగా.. అందుకే నటనవైపు