Actor Saleem Ghouse Died: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పలువురు ప్రముఖులు అనారోగ్యంతో కన్నుమూయగా.. తాజాగా సీనియర్ నటుడు సలీమ్ ఘౌస్(70) మృతి చెందారు. గురువారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల ఆయన తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సలీమ్ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన భార్య అనితా సలీమ్ నిర్ధరించారు. 1952 జనవరి 10న మద్రాసులో జన్మించిన సలీమ్.. థియేటర్ ఆర్టిస్టు, డైరెక్టర్, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు. బుల్లితెర సీరియళ్లతో పాటు సినిమాల్లోనూ నటించారు. ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనగళ్ తెరకెక్కించిన 'భారత్ ఏక్ ఖోజ్'.. టీవీ సిరీస్‌లో టిప్పు సుల్తాన్ పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తన కుటుంబం మల్టీ కల్చరల్ ఫ్యామిలీ అని ఓ గర్వంగా చెప్పుకునేవారు సలీమ్. 'తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్, భార్య పంజాబీ, బావమరిది బ్రాహ్మణుడు.. ఇలా భారతదేశమంతా మా ఇంట్లోనే ఉంద'ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సలీమ్‌కు సంగీతం అంటే చాలా ఇష్టం. తెలుగులో రామ్‌గోపాల్ వర్మ, నాగార్జున, ఊర్మిళా కాంబోలో వచ్చిన 'అంతం' సినిమాలో ఇన్స్పెక్టర్ పాత్రలో నటించారు సలీమ్. ఆ తర్వాత నాగార్జునతో మరోసారి 'రక్షణ' సినిమాలో చేశారు. దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ముగ్గురు మొనగాళ్లు' చిత్రంలో విలన్‌గా కనిపించారు. కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో కూడా సలీమ్ నటించారు.
ఇవీ చదవండి: యువ హీరో ఇంట విషాదం.. తండ్రి కన్నుమూత
స్టార్ హీరోకు కోర్టులో ఊరట.. మైనర్‌పై వేధింపుల కేసులో క్లీన్చిట్