ANR NTR 100 Years Birth anniversary: నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వర రావు (ఏఎన్ఆర్) అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన వీరు వందల సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే 1949లో ఎన్టీఆర్ పరిశ్రమలోకి ప్రవేశించే సమయానికే ఏఎన్ఆర్ బిజీ స్టార్. అప్పటికే 'పల్నాటి యుద్ధం', 'బాలరాజు', 'కీలుగుర్రం', 'లైలామజ్ను' లాంటి సూపర్ డూపర్ హిట్స్‌తో ఏఎన్ఆర్ టాప్‌లో ఉన్నారు. నాగయ్య, చదలవాడ నారాయణరావు లాంటి సీనియర్ హీరోల కన్నా ఏయన్నార్ లేతగా, గ్లామరస్‌గా కనిపించడంతో నిర్మాతలందరూ ఆయన కోసమే ఎగబడే వారు. పౌరాణికాలు, జానపదాలు ఎక్కువగా వెలువడే ఆ రోజుల్లో అన్ని పాత్రలు ఏఎన్నార్‌నే వరించాయి. అప్పుడు ఏఎన్నార్‌కి తన ఈడు వాడైన ఎన్టీఆర్ వచ్చాడని తెలిసింది. ఆ రోజుల్లో గొప్పగా భావించే బి.ఎ.డిగ్రీ పాసై పరిశ్రమకు వచ్చిన ఎన్టీఆర్‌ని చూడగానే ఆయన పర్సనాలిటీ ఏఎన్నార్‌ని ఆకర్షించింది. త్వరలోనే ఆ ఇద్దరూ మిత్రులయ్యారు. కానీ ఎన్టీఆర్‌ను చూసి ఏఎన్ఆర్ భయపడేవారట. కడుపు నిండా తిండి కూడా తినడం మానేశారట. ఈ విషయాన్ని గతంలో ఏఎన్ఆరే స్వయంగా చెప్పారు.
"మా ఇద్దరి బంధం అపూర్వమైనది. ఆయన కన్నా సినిమాల్లోకి ముందుకు వచ్చినా.. ఆయన్ను చూసి ఇబ్బంది పడ్డాను. అద్భతమైన వాక్చాతుర్యం కలిగినవాడు. నా కంటే బాగా ఉండేవాడు. ఇక నా పరిస్థితి ఏంటి అని చాలా సార్లు ఆలోచించా. భయపడ్డా! అప్పటినుంచి ఎటువంటి పాత్రలు వేస్తే బాగుండేదని ఆలోచించి జాగ్రత్తగా పాత్రలు ఎంచుకుంటూ చేశా. ఆయన వేసిన పాత్రలు నేని వేసి ఉంటే సెట్ అయ్యేవి కాదు. అవి ఆయన మాత్రమే చేయగలరు. రాముడు పాత్ర నన్ను చేయమన్నారు. నేను ఒప్పుకోలేదు. ఒకవేళ నేను చేసి ఉంటే మరుగుజ్జు రామాయణం అయిపోతుందని అన్నాను. ఎన్టీఆర్ పేరును సూచించా. ఎందుకంటే అది ఆయనకు సెట్ అవుతుంది. అయితే నేను ఎక్కువ తినకుండా, లావు కాకుండా జాగ్రత్త పడింది రామారావు వల్లే. నేను కడుపునిండా అన్నం తినేవాడిని కాదు. అసలే పొట్టి. ఇక ఫుట్‌బాల్ లా అయితే నన్ను ఎవరూ చూస్తారు. అందుకే రామారావును దృష్టిలో పెట్టుకుని తినేవాడిని కాదు. నాలో అహం పెరగకుండా ఉండటానికి కారణం ఆయనే." అని అన్నారు.
కాగా, ఎన్టీఆర్-ఏఎన్ఆర్ కలిసి 'పల్లెటూరి పిల్ల', 'సంసారం', 'రేచుక్క' (ఇందులో ఏయన్నార్‌ది అతిథి పాత్ర), 'పరివర్తన', 'మిస్సమ్మ', 'తెనాలి రామకృష్ణ', 'చరణదాసి', 'మాయాబజార్', 'భూకైలాస్', 'గుండమ్మ కథ', 'శ్రీ కృష్ణార్జున యుద్ధం', 'భక్త రామదాసు' (ఇద్దరూ అతిథి పాత్రలు వేశారు), 'చాణక్య చంద్రగుప్త', 'రామకృష్ణులు, 'సత్యం శివం' చిత్రాల్లో నటించారు.
ఇదీ చూడండి: రాముడు, కృష్ణుడు.. ఏ పాత్ర అయినా గుర్తొచ్చేది ఆయనే