2022 HIT FLOP movies: అప్పుడే సినీ క్యాలెండర్‌లో నాలుగు నెలలు చకచకా మారిపోయాయి. ఓవైపు కొవిడ్ భయాలు.. మరోవైపు టికెట్ రేట్ల సమస్యలు.. ఇవన్నీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ నెమ్మదిగా నూతనోత్తేజాన్ని సంతరించుకుంది చిత్రసీమ. ఈ నాలుగు నెలల్లో దాదాపు పాతికకుపైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో చిన్న సినిమాలతో పాటు కొన్నేళ్లుగా ఊరిస్తూ వచ్చిన భారీ చిత్రాలూ ఉన్నాయి. ఇందులో కొన్ని బాక్సాఫీస్ ముందు భారీ వసూళ్లతో సత్తా చాటగా.. ఇంకొన్ని అంచనాలు అందుకోలేక చతికిల పడ్డాయి. మరి మొత్తంగా ఈ నాలుగు నెలల్లో చిత్రసీమకు ఎదురైన జయాపజయాల్ని ఒక్కసారి ఆరా తీస్తే..
ఈ ఏడాది ఆరంభంలోనే కొవిడ్ మూడో దశ ప్రభావం చిత్ర సీమపై స్పష్టంగా కనిపించింది. ఫలితంగా పెద్ద చిత్రాలన్నీ వెనక్కి తగ్గడంతో.. చిన్న సినిమాల సందడుల మధ్య జనవరి చప్పగా మొదలైంది. జనవరి 1న రామ్‌గోపాల్ వర్మ 'ఆశా ఎన్‌కౌంటర్', వరుణ్ సందేశ్ 'ఇందువదన' వంటి చిత్రాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. ఈ రెండూ దారుణ ఫలితాల్నే చవిచూశాయి. కొవిడ్ భయాల వల్ల సంక్రాంతికి రావాల్సిన 'ఆర్‌ఆర్‌ఆర్', 'రాధేశ్యామ్' వంటి బడా చిత్రాలన్నీ వాయిదా పడటంతో.. ఆ అవకాశాన్ని 'అతిథి దేవోభవ', 'రౌడీ బాయ్స్', 'హీరో' వంటి చిన్న చిత్రాలు అందిపుచ్చుకున్నాయి. ఆఖరి నిమిషంలో నాగార్జున, నాగచైతన్యల 'బంగార్రాజు'తో పండగ బరిలోకి దిగడంతో బాక్సాఫీస్ వద్ద ఉత్సాహకర వాతావరణం కనిపించింది. వీటిలో ఈ ఒక్క పెద్ద సినిమా తప్ప మిగిలిన చిన్న చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. 'హీరో' మంచి ప్రయత్నంగా ప్రేక్షకుల మెప్పు లభించింది. కరోనా పరిస్థితుల వల్ల పండగ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లపై ఆంక్షలు విధించారు. దీంతో సంక్రాంతి తర్వాతి వారం ఏ ఒక్క చిత్రం బాక్సాఫీస్ ముందుకు రాలేదు. ఇక జనవరి ఆఖర్లో 'గుడ్‌లక్ సఖి'గా ప్రేక్షకుల ముందుకొచ్చింది కీర్తి సురేష్. షూటింగ్ ఆట నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కనీస ఆదరణ దక్కలేదు.
టిల్లు నవ్వులు.. భీమ్లా గర్జన.. ఫిబ్రవరి నాటికి కొవిడ్ మూడో దశ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్త చిత్రాల సందడి రెట్టింపయ్యింది. ఫిబ్రవరి 4న విశాల్ 'సామాన్యుడు'గా బాక్సాఫీస్ ముందుకొచ్చారు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అయితే కథ కథనాలు అంత ఆసక్తికరంగా సాగకపోవడంతో.. సినీప్రియుల మెప్పు పొందలేకపోయింది. 11న రవితేజ ‘ఖిలాడీ’తో.. విష్ణు విశాల్ ‘ఎఫ్‌ఐఆర్’తో, హర్ష్ కనుమిల్లి ‘సెహరి’తో బాక్సాఫీస్ ముందు పోటీ పడ్డారు. వీటిలో ఖిలాడీ కొంచెం ఫర్వాలేదనిపించినా, మిగతావి కనీస ఆదరణ పొందలేకపోయాయి. 12న విడుదలైన ‘డీజే టిల్లు’ థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించింది. ఈ ఏడాది విజయపతాకం ఎగరేసిన తొలి చిన్న సినిమాగా ఘనత అందుకొంది. విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. ముఖ్యంగా సిద్ధూ జొన్నలగడ్డ నటనకు, ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరుకు సినీ ప్రియుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఆ మరుసటి వారం మోహన్‌బాబు ‘సన్నాఫ్ ఇండియా’గా థియేటర్లలో సందడి చేశారు. ఈ సినిమాకు హీరోగానే కాక స్క్రీన్‌ప్లే రచయితగానూ వ్యవహరించారు. అయితే ఆయన మ్యాజిక్కు బాక్సాఫీస్ ముందు వర్కవుటవ్వలేదు. ఫిబ్రవరి 24న ‘వలిమై’, 25న ‘గంగూబాయి కాఠియావాడి’, ‘భీమ్లానాయక్’ వంటి బడా చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వరుస కట్టాయి. వీటిలో పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ మాత్రమే మంచి వసూళ్లతో సత్తా చాటింది.
మార్చిలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఒక్కటే.. మార్చి నాటికి కొవిడ్ పూర్తిగా అదుపులోకి రావడం.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల సమస్యలు తొలగడంతో బడా చిత్రాల సందడి రెట్టింపయ్యింది. మార్చి 4న కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’, శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటీ హిట్టు కొట్టలేకపోయింది. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జైభీమ్’ సినిమాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలందుకున్న సూర్య.. ఈసారి ‘ఈటీ’తో బాక్సాఫీస్ ముందుకొచ్చారు. మార్చి 10న విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమాకి తెలుగు నాట కనీస వసూళ్లు కూడా దక్కలేదు. ఎన్నాళ్లుగానో వేచి చూసిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మార్చి 11న విడుదలైంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే వసూళ్లను దక్కించుకున్న ఈ చిత్రం.. ప్రేక్షకుల మిశ్రమ స్పందన కారణంగా తర్వాతి నుంచి ఆస్థాయి వసూళ్లు రాబట్టలేకపోయింది. రాజ్‌తరుణ్ ‘స్టాండప్ రాహుల్’గా అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయాడు. మార్చి నెలాఖరున విడుదలై.. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను దక్కించుకున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించింది. దక్షిణాది.. ఉత్తరాది అని తేడాల్లేకుండా అదిరిపోయే కలెక్షన్లతో జోరు చూపించింది.
ఏప్రిల్‌లో ‘కేజీఎఫ్2’ హవా.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా జోరు ఏప్రిల్ తొలి వారమంతా కనిపించింది. భారీ అంచనాల మధ్య 8న ‘గని’గా థియేటర్లలో అడుగు పెట్టారు వరుణ్ తేజ్. అయితే ఆయన కష్టానికి ఆశించిన ఫలితం దక్కలేదు. రెండో వారంలో ఒక్కరోజు వ్యవధిలో విజయ్ ‘బీస్ట్’, యశ్ ‘కేజీఎఫ్2’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో విజయ్ చిత్రానికి చేదు ఫలితం ఎదురవగా.. యశ్ మరో అదిరిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఏప్రిల్ 28న విజయ్ సేతుపతి, సమంత, నయనతారల ‘కణ్మణి రాంబో ఖతీజా’ విడుదలైంది. ఇది అటు తమిళ్‌లోనూ ఇటు తెలుగులోనూ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇక ఏప్రిల్‌కు ‘ఆచార్య’తో అదిరిపోయే ముగింపు దొరికింది. చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కినా.. వసూళ్ల పరంగా స్టడీగా కొనసాగుతోంది. మేలో మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’, వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్3’ వంటి బడా చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. వీటితో పాటు ‘జయమ్మ పంచాయితీ’, ‘భళా తందనాన’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘శేఖర్’, ‘కృష్ణ వ్రిందా విహారి’ వంటి పరిమిత బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇవన్నీ ప్రేక్షకుల మెప్పు పొంది.. మంచి వసూళ్లు రాబడితే వేసవి సీజన్‌కు మంచి ముగింపు దొరికినట్లవుతుంది.
ఇదీ చూడండి: అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌కు 'కేజీఎఫ్ 2' షాక్