ఒకప్పుడు పరభాషా చిత్రాల్ని డబ్బింగ్ బొమ్మలంటూ ఓ గాటిన కట్టేసేవారు. కానీ, ఇప్పుడవన్నీ పాన్ ఇండియా ట్యాగ్ తగిలించుకొని దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ ఏడాది ఇతర భాషల నుంచి తెలుగులోకి దాదాపు యాభైకి పైగా చిత్రాలు రాగా.. వాటిలో పదికి పైగా సినిమాలు సంచలన విజయాల్ని అందుకున్నాయి. ఏటా సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఒకటి రెండు అనువాద సినిమాలైనా తెలుగు వారిని పలకరిస్తుంటాయి. కానీ, కొవిడ్ మూడో దశ ఉద్ధృతి వల్ల ఈసారి ఆ సందడి కనిపించలేదు. ఫిబ్రవరిలో 'సామాన్యుడు', 'ఎఫ్‌ఐఆర్', 'గంగూబాయి కాఠియావాడి', 'వలిమై'.. ఇలా దాదాపు అరడజను వరకు అనువాద చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో 'గంగూబాయి..'కి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు. మార్చిలో 'హేయ్ సినామిక', 'ఈటీ', 'ది కశ్మీర్ ఫైల్స్', 'జేమ్స్' లాంటి చిత్రాలు విడుదల కాగా.. 'కశ్మీర్ ఫైల్స్' మినహా ఏ ఒక్కటీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ బాలీవుడ్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సుమారు రూ.400కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది.
ఏప్రిల్‌లో వచ్చిన 'కేజీఎఫ్2'తో మరోసారి దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని అలరించారు కథానాయకుడు యష్. 'కేజీఎఫ్'కు కొనసాగింపుగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రమిది. యష్ - సంజయ్ దత్‌ల పోటాపోటీ నటన.. ప్రశాంత్ నీల్ టేకింగ్ స్టైల్‌కు సినీప్రియులు జేజేలు పలికారు. ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించగా.. పూర్తి రన్‌లో రూ:900కోట్ల వసూళ్లతో సత్తా చాటిందని ట్రేడ్ పండితులు లెక్కలేస్తున్నారు. ఇదే నెలలో విడుదలైన 'బీస్ట్', 'కణ్మని కతీజా రాంబో' చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. మేలో శివ కార్తికేయన్ 'డాన్'గా సందడి చేయగా.. దానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. జూన్‌లో కమల్‌హాసన్ 'విక్రమ్'తో.. రక్షిత్ శెట్టి 'చార్లి 777'తో పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించారు. కమల్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'.. ప్రపంచవ్యాప్తంగా రూ.450కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక అడ్వెంచర్ కామెడీ డ్రామాగా దాదాపు రూ.20కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'చార్లి 777'.. రూ.105కోట్లకు పైగా రాబట్టి సత్తా చాటింది.
జులైలో మాధవన్ 'రాకెట్రీ'తో.. సాయిపల్లవి 'గార్గి'గా.. కిచ్చా సుదీప్ 'విక్రాంత్ రోణ'గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇందులో 'రాకెట్రీ', 'గార్గి' చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. ముఖ్యంగా 'గార్గి'కి ఇటు సినీప్రియులతో పాటు అటు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. ఓవైపు చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచార వైనాల్ని.. మరోవైపు న్యాయస్థానాలు, పోలీసు వ్యవస్థల పనితీరును ఈ చిత్రంతో కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు గౌతమ్ రామచంద్ర. ఇందులో గార్గిగా సాయిపల్లవి తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా'తో, విక్రమ్ 'కోబ్రా'తో ఆగస్టు బరిలో అదృష్టం పరీక్షించుకోగా.. రెండూ చేదు ఫలితాల్నే అందుకున్నాయి. సెప్టెంబరులో ఆర్య 'కెప్టెన్'తో పాటు రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త్రం', విక్రమ్, కార్తీల 'పొన్నియిన్ సెల్వన్1' వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. వీటిలో మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియిన్ సెల్వన్'కు మాత్రమే ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది.
ఇక అక్టోబరులో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం 'కాంతార'. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రమిది. కర్ణాటకలోకి ఓ ప్రాంతంలో జరిగిన కథను ఆధారంగా చేసుకొని.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించిన తీరు సినీప్రియులతో పాటు విమర్శకుల్ని మెప్పించింది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో రిషబ్ నటన ప్రతిఒక్కరినీ కట్టి పడేసింది. రూ.16కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.450కోట్ల వసూళ్లు దక్కించుకొని సత్తా చాటింది. ఇక ఇదే నెలలో విడుదలైన శివ కార్తికేయన్ 'ప్రిన్స్', అక్షయ్ కుమార్ 'రామ్ సేతు' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టగా.. కార్తి 'సర్దార్' ప్రేక్షకుల మెప్పు పొందింది.
నవంబరులో 'బనారస్', 'లవ్‌టుడే' చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాయి. వీటిలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన 'లవ్‌టుడే' యువతరాన్ని ఆకర్షించింది. రూ.5కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా.. దాదాపు రూ.70కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకోవడం విశేషం. డిసెంబరులో ఇప్పటి వరకు 'మట్టి కుస్తీ', 'విజయానంద్' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. వీటిలో విష్ణు విశాల్ నటించిన 'మట్టి కుస్తీ'కి మంచి టాక్ లభించినా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు. రాబోయే రెండు వారాల్లో 'అవతార్2', 'ఆక్రోశం', 'కనెక్ట్' వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. అయితే వీటిలో 'అవతార్2'పైనే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఇది వెండితెరపై ఎలాంటి రికార్డులు సృష్టించనుందో చూడాలి.