2018 Official Oscar Entry : వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్ '2018'(2018 Movie) అధికారికంగా ఎంపికైంది. 2024లో ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో '2018-ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో'ని జ్యూరీ ఎంపిక చేసింది. దీనిపై స్పందించిన ఆ చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్.. ఇది తాను కలలో కూడా ఊహించలేదని అన్నారు. భారత్ నుంచి అధికారికంగా తమ సినిమా ఆస్కార్‌కు ఎంపిక కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌కు ముందు, చిత్రీకరణ సమయంలో మూవీ టీం మొత్తం ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించిన విశేషాలను ఆయన ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
'కలగంటున్నా'!
'నేను ఇప్పుడు కలగంటున్నా' అంటూ జోసెఫ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒక భయంకర విపత్తును ఎదుర్కొని, ఐక్యంగా నిలిచి ఎలా పోరాడారో అద్భుతంగా చాటిచెప్పిన కథ '2018' అని ఆయన అన్నారు.
వ్యక్తిగత అనుభవంతోనే!
2018లో కేరళలో వచ్చిన అతిభయంకరమైన వరదల ప్రభావాన్ని కళ్లారా చూశానని.. అందులో తాను ఒక బాధితుడినని ఆంథోనీ చెప్పారు. ఈ వ్యక్తిగత ఆనుభవాన్నే ప్రేరణగా తీసుకొని సినిమాను తీయాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన తెలిపారు.
కలలో కూడా ఊహించలేదు!
'ఈ సినిమా ముందుగానే మంచి వసూళ్లను సాధిస్తుందని అనుకున్నాను. కానీ, నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ, గుర్తింపు లభించింది. దీనిని నేను కలలో కూడా ఊహించలేద'ని దర్శకుడు జోసెఫ్ అన్నారు.
నన్ను నమ్మినందుకు వారికి థ్యాంక్స్!
'ఆస్కార్ అనే ఆలోచనే నా మదిలో ఎప్పుడు లేదు. కానీ, ఇప్పుడు సినిమా ఆస్కార్‌కు అధికారికంగా ఎంపిక కావడం వల్ల నేను ఆస్కార్ కోసం కలలు కంటున్నాను' అంటూ జోసెఫ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనను నమ్మిన సినిమా నిర్మాతలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
మా కష్టానికి ఫలితం దక్కింది!
'ఈ సినిమాను ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం మాకుంది. కానీ, అన్ని భాషల్లోనూ ఇంతలా ఆదరిస్తారని అస్సలు అనుకోలేదు. దీనిని నేను కలలో కూడా ఊహించలేదు. మా కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు మాకు దక్కింది' అని జోసెఫ్ చెప్పుకొచ్చారు.
ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం!
షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడగ్గా.. స్క్రిప్ట్ గురించి ఇతరులను ఒప్పించడం, వర్షంతో పాటు చీకటిలో షూటింగ్ చేయడం అత్యంత సవాళ్లతో కూడుకున్న పని అని ఆయన అన్నారు. అలాగే చిత్రీకరణ సమయంలో మూవీ టీమ్ ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల గురించి కూడా జోసేఫ్ ప్రస్తావించారు. 'కేవలం ప్రీ-ప్రొడక్షన్ పనులకే దాదాపు రెండేళ్ల పాటు సమయం పట్టింది. అయితే సినిమా చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డాము. ముఖ్యంగా రాత్రిపూట ప్రతికూల వాతావరణంలో షూట్ చేశాము. మొత్తం 102 రోజుల్లోనే ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఈ ఏడాది మేలో సినిమాను సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్ చేశాము' అని దర్శకుడు వివరించారు.
ఈ సినిమా వారికే అంకితం!
చివరగా ఈ సినిమాను మాలీవుడ్ చిత్ర నిర్మాతలతో పాటు మలయాళ ప్రేక్షకులకు అంకితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 'నేను మలయాళ ఫిల్మ్‌మేకర్‌ను అయినందుకు చాలా గర్విస్తున్నాను. మా చిత్రపరిశ్రమలో మాకు చాలా ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్స్ ఉన్నారు. అలాగే నాకు ఈ గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపును కూడా ప్రొడ్యూసర్స్‌కు, ఆడియెన్స్‌కే అంకితం చేస్తున్నాను' అని జూడ్ ఆంథోనీ జోసెఫ్ పేర్కొన్నారు.
త్వరలో మేకింగ్ వీడియో రిలీజ్!
సినిమాలో యాక్ట్ చేసిన నటీనటుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇందులో నటించిన ప్రతిఒక్క ఆర్టిస్టు తన కుటుంబ సభ్యుల్లాంటి వారని జోసెఫ్ చెప్పారు. ఎంత పెద్ద స్టార్స్ అయినా సాధారణ వ్యక్తుల్లా క్యారెక్టర్లలో ఒదిగిపోయి నటించారని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా త్వరలోనే సినిమా మేకింగ్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు ఆయన తెలిపారు.
విమర్శకుల ప్రశంసలను సైతం!
నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కించారు. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమాను రూపొందించారు. ఆద్యంతం భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దిన ఈ సినిమా మలయాళంతో పాటు, ఇతర భాషల సినీ ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. అందరితో కంటతడి పెట్టించింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కాగా, ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకోవడం విశేషం. ఇక ప్రస్తుతం 2018 మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సోనీలివ్'లో తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ దూసుకుపోతుంది.
Oscar Race 2024 Indian Movie : ఆస్కార్ బరిలో '2018'.. అవార్డు గెలవనుందా?
Chandramukhi 2 Twitter Review : 'వెట్టయాన్ రాజా వచ్చేశాడు'.. మరి ఆడియెన్స్‌ను మెప్పించాడా?