ఉత్తరాఖండ్ ఏర్పడి 19ఏళ్లు. మధ్యలో 3 సార్వత్రిక సమరాలు. గెలుపు మాత్రం ఎప్పుడూ రెండు ప్రధాన జాతీయ పార్టీల అభ్యర్థులదే. ఒకే ఒక్కసారి ఎస్పీ అభ్యర్థిని విజయం వరించింది.
ఉత్తరాఖండ్ రాజకీయం భాజపా, కాంగ్రెస్ చుట్టూనే తిరగడానికి కారణం ఏంటి?
"ఉత్తరాఖండ్ సరిహద్దు రాష్ట్రం. ఇక్కడి ప్రజల్లో అనేక మంది సాయుధ దళాల్లో పనిచేస్తారు. కాబట్టి జాతీయ భావాలు ఎక్కువ. అందుకే ప్రాంతీయ పార్టీలను వారు ప్రోత్సహించరు.
ఉత్తరాఖండ్‌కు చెందిన గోవింద్ వల్లభ్ పంత్, హేమ్వతి నందన్ బహుగుణ, ఎన్డీ తివారీకి జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు జాతీయ దృక్కోణంతోనే ఆలోచిస్తారు."
-- జైసింగ్ రావత్, రాజకీయ విశ్లేషకుడు
ఈసారీ అంతే!
ప్రస్తుత ఎన్నికల్లో 5 స్థానాల్లో నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి భాజపా, కాంగ్రెస్. ఎస్పీ, బీఎస్పీ ఉత్తరాఖండ్‌లోనూ కలిసి పోటీచేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఐదింట ఒక స్థానం ఎస్పీకి దక్కింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ పౌరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తొలుత ఊహాగానాలు వినిపించాయి. ఆమె జన్మస్థలం ఉత్తరాఖండ్ అవడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది ఎస్పీ. బలమైన అభ్యర్థి లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పింది. మిగిలిన 4 స్థానాల్లో బీఎస్పీ పోటీచేస్తోంది.
"కాంగ్రెస్, భాజపా మినహా ఉత్తరాఖండ్‌లో మరే ఇతర రాజకీయ పార్టీలకు క్షేత్రస్థాయిలో బలం లేదు. కాబట్టి ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే."
-- అవదేశ్ కౌశల్, రాజకీయ విశ్లేషకుడు
"తృతీయ కూటమి ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు ప్రయత్నించాయి. కానీ అవన్నీ చివరకు భాజపాలోనే, కాంగ్రెస్‌లోనే విలీనం అయిపోయాయి. భాజపా, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా మిగిలాయి."
-- జైసింగ్ రావత్, రాజకీయ విశ్లేషకుడు
కూటమికి ప్రయత్నించినా...
1990 నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన స్థానిక పార్టీల్లో ఉత్తరాఖండ్ క్రాంతి దళ్-యూకేడీ ఒకటి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండబోతుందని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్, భాజపా ముందు యూకేడీ నిలవలేకపోయింది.
గత లోక్‌సభ ఎన్నికల్లో యూకేడీ అభ్యర్థులు దాదాపు అందరూ డిపాజిట్లు కోల్పోయారు. అయినా... ఈసారి విజయంపై ధీమాగా ఉంది ఉత్తరాఖండ్ క్రాంతి దళ్. 5 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టింది.