ద్రవిడ రాజకీయాల్లో గెలుపోటములు ఎప్పుడూ అన్నాడీఎంకే, డీఎంకే మధ్యే. ఉంటే అధికారంలో... లేదంటే ప్రధాన ప్రతిపక్షం. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. మరి చిన్న పార్టీల సంగతి...? ఉన్నాయి... ఉనికి కాపాడుకునే స్థితిలో. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనైనా పొత్తులో తమకు వచ్చిన స్థానాలను కాపాడుకునే ప్రయత్నంలో చిన్న పార్టీలు నిమగ్నమయ్యాయి.
రాష్ట్రంలోని పీఎంకే, డీఎండీకే, ఐజేకే, ఎండీఎంకే లాంటి చిన్న పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితంపై వాటి భవిష్యత్ ఆధారపడి ఉంది.
జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేకి అనుబంధంగా ఉండే చిన్న పార్టీలు తమ ప్రాతినిధ్యం పెరుగుతుందని భావించాయి. కానీ పళనిస్వామి-పన్నీర్‌సెల్వం వారికి ఆ అవకాశం రానివ్వలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా అండతో... ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడ్డారు ఈపీఎస్-ఓపీఎస్.
జయలలిత మరణానంతరం ఏ ఎన్నికలూ జరగలేదు. ఒక్క ఆర్కే నగర్ ఉపఎన్నిక తప్ప. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపైనే ఆశలు పెట్టుకున్నాయి చిన్న పార్టీలన్నీ.
పీఎంకే
పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీకి 7 సీట్లు కేటాయించింది అన్నాడీఎంకే. కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి కోసం వేల్మురగన్, అన్బుమణి రామదాస్ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ పీఎంకే అనుకున్న స్థానాలు సాధించలేకపోతే వారి భవిష్యత్తే ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది.
డీఎండీకే
2005లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగమ్(డీఎండీకే) పార్టీని నెలకొల్పి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు నటుడు విజయ్‌కాంత్. 2006 అసెంబ్లీ ఎన్నికల్లోనే అనూహ్యంగా 8.38 శాతం ఓట్లు సంపాదించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10.08 శాతం ఓట్లు సొంతం చేసుకుంది డీఎండీకే. 2014లో భాజపాతో పొత్తు పెట్టుకొని ఘోర పరాజయం చవిచూసింది.
ప్రస్తుతం అన్నాడీఎంకే కూటమిలో చేరి 4 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది డీఎండీకే. 4 చోట్లా పోటీ గట్టిగా ఉంది. అయినా ఆరోగ్య సమస్యల వల్ల సరిగా ప్రచారం చేయలేకపోతున్నారు విజయ్‌కాంత్.
ఎండీఎంకే, వీసీకే
వైకో స్థాపించిన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగమ్ (ఎండీఎంకే) పార్టీకి ఒక్క సీటు కేటాయించింది డీఎంకే. అధినేత వైకోకు రాజ్యసభ సీటు ఇస్తామని వాగ్దానం చేశారు డీఎంకే అధినేత స్టాలిన్. కేవలం ఒక్కసీటు ఇచ్చినప్పటికీ ఆశావాదంతో ఉన్నారు ఎండీఎంకే నేతలు. వైకో రాజ్యసభ సభ్యుడైన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పొచ్చన్నది వారి ఆలోచన.
విడుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే)కి పొత్తులో భాగంగా రెండు సీట్లు కేటాయించింది డీఎంకే.
ఎంఎన్ఎమ్
నటుడు కమల్ హాసస్ పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎమ్) అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో వారి బలాబలాలను తెలుసుకుని... శాసనసభ ఎన్నికలకు అవసరమైన కార్యాచరణ ప్రారంభించాలన్నది కమల్ ఆలోచన.
పొత్తులో భాగంగా 39 పార్లమెంటరీ నియోజక వర్గాల్లో 19 సీట్లను మిత్ర పక్షాలకు కేటాయించాయి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు. ఈ రెండు పార్టీలు నేరుగా తలపడేది కేవలం 8 స్థానాల్లోనే. మిగిలిన చోట్ల వాటికి మద్దతిస్తున్న పార్టీల మధ్యే పోటీ ఉండనుంది. తమిళనాట సాగుతున్న ఈ సరికొత్త రాజకీయ క్రీడలో విజేత ఎవరో వేచిచూడాలి.
ఇవీ చూడండి: