14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు... 1,279 మంది అభ్యర్థులు ... 91 లోక్‌సభ స్థానాలు... లక్షా 70 వేల పోలింగ్ కేంద్రాలు...... సార్వత్రిక ఎన్నికల తొలిదశ స్వరూపం ఇది.
మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గురువారం తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు అధికారులు.
ఎన్నికల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో...
ఆంధ్రప్రదేశ్ -25, తెలంగాణ- 17 కలిపి మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. మొదిటి విడతలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
యూపీలో భారీ బందోబస్తు..
అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో రేపు 8 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రతా ఎర్పాట్లు చేసింది. లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
'రసీదు' ఎన్నికలు...
సార్వత్రిక ఎన్నికల కోసం తొలిసారి పూర్తిస్థాయిలో వీవీప్యాట్ ఈవీఎంలు ఉపయోగిస్తోంది ఈసీ. వీవీప్యాట్‌లో వచ్చే రసీదు చూసి, మన ఓటు ఎవరికి పడిందో నిర్ధరించుకోవచ్చు.
ఇదీ చూడండి: ఎన్నికల భారతంలో ఎన్నెన్ని సిత్రాలో..!