1,279 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు కాసేపట్లో ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం 91 లోక్సభ స్థానాలకు తొలిదశలో పోలింగ్ జరగనుంది.
మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాసేపట్లో తొలిదశ పోలింగ్ మొదలుకానుంది. ఎన్నికల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో...
ఆంధ్రప్రదేశ్ -25, తెలంగాణ- 17 కలిపి మొత్తం 42 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
యూపీలో భారీ బందోబస్తు..
అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్లో నేడు 8 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
బస్తర్ కట్టుదిట్టం..
ఛత్తీస్గఢ్ బస్తర్ లోక్సభ నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం చేశారు. 80 వేల మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడమే ఇందుకు కారణం. దంతెవాడ ఈ నియోజకవర్గం కిందకే వస్తుంది. 741 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు.
'రసీదు' ఎన్నికలు...
సార్వత్రిక ఎన్నికల కోసం తొలిసారి పూర్తిస్థాయిలో వీవీప్యాట్ ఈవీఎంలు ఉపయోగిస్తోంది ఈసీ. వీవీప్యాట్లో వచ్చే రసీదు చూసి, మన ఓటు ఎవరికి పడిందో నిర్ధరించుకోవచ్చు.